రాజస్థాన్ పోలీసు దళంలోకి 438 మంది మహిళా కానిస్టేబుళ్లు.. దీక్షాంత్ పరేడ్‌లో కర్తవ్య ప్రమాణం
సూర్య జాతీయ డెస్క్: రాజస్థాన్ పోలీసు వ్యవస్థలో మహిళా శక్తికి మరింత పెద్దపీట వేస్తూ నూతనంగా శిక్షణ పూర్తి చేసుకున్న 438 మంది మహిళా కానిస్టేబుళ్లు అధికారికంగా పోలీసు దళంలో చేరారు. జైపూర్‌లోని ప్రతిష్టాత్మక రాజస్థాన్ పోలీస్ అకాడమీ (ఆర్పీఏ) వేదికగా బ్యాచ్-102కు చెందిన నవశిక్షణ కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ (పాసింగ్ ఔట్ పరేడ్) అత్యంత వైభవంగా జరిగింది. కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న మహిళా పోలీసులు క్రమశిక్షణతో కూడిన ఆకర్షణీయమైన కవాతును ప్రదర్శించి, ప్రజాసేవ మరియు రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని కర్తవ్య ప్రమాణం చేశారు.
ఈ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి రాజస్థాన్ డీజీపీ రాజీవ్ కుమార్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్ కమాండర్ ప్రియాంక బేనీవాల్ నేతృత్వంలో సాగిన కవాతును డీజీపీ నిశితంగా పరిశీలించి మహిళా కానిస్టేబుళ్ల క్రమశిక్షణను, అంకితభావాన్ని కొనియాడారు. అదనపు డీజీపీ, అకాడమీ డైరెక్టర్ సంజీబ్ కుమార్ నార్జారీ నూతన కానిస్టేబుళ్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. పోలీస్ యూనిఫాం కేవలం అధికారానికి చిహ్నం కాదని, సమాజానికి, బాధితులకు అండగా నిలిచే గొప్ప బాధ్యత అని డీజీపీ ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.
పోలీస్ స్టేషన్లను కేవలం పరిపాలనా కార్యాలయాలుగా కాకుండా ప్రజలకు స్వాంతన చేకూర్చే సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని డీజీపీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఠాణాలకు వచ్చినప్పుడు వారి సమస్యలను అత్యంత సున్నితత్వంతో ఆలకించి సత్వర న్యాయం అందించాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, కమ్యూనిటీ పోలీసింగ్, నిఘా వ్యవస్థ బలోపేతంలో మహిళా పోలీసుల పాత్ర కీలకంగా మారిందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో వినూత్న ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు ఉన్నతాధికారులు ట్రోఫీలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.