దసరా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్ : ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విశేష సేవల ఆన్‌లైన్ టికెట్లను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఆలయ స్థానాచార్యులు, అర్చక బృందం వేద మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి ఆన్‌లైన్ టికెట్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. భక్తుల సౌకర్యం, పారదర్శకత, సులభతరమైన సేవలందించడమే లక్ష్యంగా ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ 9552300009 ద్వారా నిర్ణీత సంఖ్యలో విశేష సేవా టికెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు. ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక చండీ హోమం, ప్రత్యేక దేవీ ఖడ్గమాలార్చన, ప్రత్యేక శ్రీచక్ర నవావరణార్చన వంటి సేవలకు భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆలయ పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, అర్చక బృందం మంత్రిని కలిసి దసరా మహోత్సవాల తొలి అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందించి మంత్రిని దసరా మహోత్సవాలకు ఆహ్వానించారు.
✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.