జనాభాకు తగ్గ రాజకీయ వాటా బీసీలకు దక్కాలి
19వ రోజుకు చేరుకున్న బీసీ రాజ్యాధికార యాత్ర
బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యం
పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలి
2028లో బీసీ ప్రభుత్వమే లక్ష్యం
– ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ బ్యూరో ప్రతినిధి : తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర 19వ రోజుకు చేరుకుంది. 19వ రోజు ఎర్రవల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర బీచుపల్లి, కొండేరు, రంగాపూర్ మీదుగా పెబ్బేరు చేరుకుంది. అనంతరం పెబ్బేరులో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో తీన్మార్ మల్లన్న ప్రసంగించారు.
ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర
మార్గమధ్యలో ప్రజలను కలుస్తూ, పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ మల్లన్న పాదయాత్ర కొనసాగించారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలను మల్లన్నకు అందజేశారు. పలువురు బీసీ సంఘాల నాయకులు మల్లన్నను కలిసి బీసీ రాజ్యాధికార యాత్రకు తమ మద్దతు తెలియజేశారు.
బీసీలు ఓటర్లుగానే మిగిలిపోవద్దు
పెబ్బేరు కార్నర్ మీటింగ్‌లో మల్లన్న మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం ఎందుకు అవసరమో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు. జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలు ఇతరులను అధికారంలో కూర్చోబెట్టే ఓటర్లుగానే కాకుండా, రాజకీయ అధికారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
బీసీల జనాభాకు తగ్గట్టుగా రాజకీయ ప్రాతినిధ్యం, అవకాశాలు దక్కాలని అన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బీసీల్లో రాజకీయ నాయకత్వం పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
భూముల్లో బీసీల వాటా ఎంత..?
తెలంగాణలో భూములు, ఆస్తులు రెడ్లు,వెలమ వర్గాల చేతుల్లో కేంద్రీకృతం కావడంపై మల్లన్న మండిపడ్డారు.
“జనాభాలో మనమెంత..? భూముల్లో మన వాటా ఎంత..? రాజకీయ అధికారంలో మన వాటా ఎంత..?” అనే విషయాలపై బీసీలు ఆలోచించాలని కోరారు. బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూములకు సంబంధించి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ సవరణ చేసి రెడ్లు,వెలమల చేతుల్లో ఉన్న కోటి ఎకరాల భూములను భూమిలేని ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున భూమి పంపిణీ చేస్తాం అని హామీ ఇచ్చారు.
పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
అర్హులైన పట్టభద్రులందరూ తప్పకుండా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని మల్లన్న పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎన్నికల్లో బీసీలు తమ రాజకీయ చైతన్యాన్ని చూపించాలని, బీసీల్లో ఇంత చేతన వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ రెండో ఎమ్మెల్సీ స్థానాలను రెడ్ల కేటాయించడంపై మండిపడ్డారు, బీసీలందరూ ఓటు రూపంలో మన సత్తా ఏంటో కాంగ్రెస్ పార్టీకి చూపియాలని అన్నారు.
2028లో బీసీ ప్రభుత్వమే లక్ష్యం
బీసీల ఆత్మగౌరవం, భూహక్కులు, రాజకీయ హక్కుల సాధనే బీసీ రాజ్యాధికార యాత్ర లక్ష్యమని మల్లన్న తెలిపారు. 2028లో తెలంగాణలో బీసీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతోనే ఈ యాత్ర కొనసాగుతోందని పేర్కొన్నారు.
“మన ఓట్లు మనం వేసుకుందాం... మన రాజ్యాన్ని మనమే ఏలుకుందాం... బీసీ రాజ్యాధికారమే మన లక్ష్యం” అని తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు బీసీ సంఘాల ప్రతినిధులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు