బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్లు
స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల దిశగా ప్రభుత్వం చర్యలు
విజయవాడ సెంట్రల్, మేజర్ న్యూస్ : బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సోమవారం బీఆర్‌టీఎస్ రోడ్డు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. రిజర్వేషన్ల విషయంలో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. విజయవాడ నగరంలో డివిజన్ల పునర్విభజన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రిజర్వేషన్లపై ప్రజలకు వాస్తవాలను వివరించాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీత సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్ పాల్గొన్నారు.
✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ.