నిబంధనల ప్రకారమే క్వార్టర్ ఖాళీ చేయించాం
బి-40 క్వార్టర్ వ్యవహారంపై జీఎం రాధాకృష్ణ వివరణ
సూర్య, మందమర్రి.సింగరేణి సంస్థకు చెందిన బి-40 క్వార్టర్ ఖాళీ చేయింపు ప్రక్రియ సంస్థ నిబంధనలు, విజిలెన్స్ నివేదిక ఆధారంగానే చేపట్టామని మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ తెలిపారు. ఈ వ్యవహారంలో స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. బి-40 క్వార్టర్‌లో మద్దిశంకర్ అనే వ్యక్తి అనధికారికంగా నివాసం ఉంటున్నట్లు విజిలెన్స్ నివేదికలో గుర్తించినట్లు జీఎం వెల్లడించారు. క్వార్టర్ కేటాయింపుపై ఎస్టేట్, పర్సనల్ విభాగాల ద్వారా వివరాలు పరిశీలించామని చెప్పారు. మంత్రికి ఇప్పటికే బి-1 క్వార్టర్‌ను క్యాంపు కార్యాలయంగా కేటాయించామని, బి-40 క్వార్టర్‌ను ఆయనకు గానీ, వివేక్‌కు గానీ అధికారికంగా కేటాయించలేదని వివరించారు. క్వార్టర్ ఖాళీ చేయాలని మద్దిశంకర్‌కు తొలుత కౌన్సెలింగ్ ఇచ్చామని, అనంతరం జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మూడుసార్లు నోటీసులు జారీ చేశామని జీఎం తెలిపారు. జూలై 27న పర్సనల్ విభాగం ద్వారా మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. అయినా క్వార్టర్ ఖాళీ చేయకపోవడంతో తదుపరి ప్రక్రియలో భాగంగా ఫారమ్-ఎ, ఫారమ్-బి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఎస్ అండ్ పీసీ విభాగం, పోలీసు శాఖ, ఎస్టేట్ అధికారుల సమక్షంలో వీడియో చిత్రీకరణ మధ్య క్వార్టర్‌ను ఖాళీ చేయించినట్లు చెప్పారు. మద్దిశంకర్‌కు ఫోన్ చేసినా రాకపోవడంతో అక్కడున్న సామగ్రిని తరలించి సురక్షిత ప్రాంతంలో భద్రపరిచామని వివరించారు. అనంతరం ఆ క్వార్టర్‌ను మరో సింగరేణి ఉద్యోగికి కేటాయించినట్లు వెల్లడించారు. సంస్థ ఆస్తుల పరిరక్షణలో భాగంగానే ఈ చర్యలు చేపట్టామని జీఎం పేర్కొన్నారు. క్వార్టర్ ఖాళీ చేయింపు వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని కోరారు.