రైతులకు 8 గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదు: హరీశ్ రావు
హైదరాబాద్, సూర్య ప్రతినిధి :రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరేకదా, కనీసం 8 గంటల నాణ్యమైన కరెంటు కూడా అందించలేకపోతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడూ గాల్లో తిరుగుతుంటే నేలపై ఉన్న రైతుల కష్టాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు ఆయనకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎప్పుడైనా సాంకేతిక కారణాలతో కేవలం రెండు గంటల కరెంటు కోత విధించినా అప్పట్లో హడావుడి చేస్తూ ధర్నాలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఏమైపోయారని, ఎక్కడ దాక్కున్నారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత, రైతుల ఇబ్బందులపై ప్రభుత్వం ఎందుకు సమీక్ష సమావేశాలు నిర్వహించడం లేదని నిలదీశారు. ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం, కనీస విద్యుత్ సరఫరా చేయలేకపోవడం వారి ఘోర పాలనా వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనమని హరీశ్ రావు విమర్శించారు.