ఇజ్రాయెల్ సెటిలర్ల కాల్పుల్లో పాలస్తీనా వ్యక్తి మృతి
సూర్య అంతర్జాతీయ డెస్క్: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు మళ్లీ తారాస్థాయికి చేరాయి. సాల్ఫిట్ సమీపంలోని యాసుఫ్ గ్రామంపై ఇజ్రాయెల్ సెటిలర్లు జరిపిన దాడిలో 51 ఏళ్ల పాలస్తీనా పౌరుడు మషూర్ యాసిన్ ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు స్థానిక అధికారులు వెల్లడించారు. తన ఇంటిపై దాడి జరుగుతున్న సమయంలో గ్రామస్తులను, కుటుంబాన్ని కాపాడేందుకు బయటకు వచ్చిన యాసిన్‌పై సెటిలర్లు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారని గ్రామ కౌన్సిల్ హెడ్ జుమా అబ్దెల్ ఫత్తా తెలిపారు. ఈ ఘటనలో ఆయన మేనల్లుడు కూడా గాయపడినట్లు పేర్కొన్నారు.
గత కొన్ని నెలలుగా వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో అక్రమ సెటిలర్ల అల్లర్లు, దాడులు విపరీతంగా పెరిగిపోయినట్లు ఐక్యరాజ్యసమితి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ సైన్యం మరియు సెటిలర్ల దాడులలో 80 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. తాజాగా జరిగిన ఈ హింసాత్మక ఘటనపై ఇజ్రాయెల్ సైనిక యంత్రాంగం (IDF) స్పందిస్తూ, దీనిపై సమగ్ర విచారణ చేపడుతున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అక్రమంగా పరిగణించబడుతున్న ఈ సెటిలర్ల విస్తరణ మరియు దాడులు ప్రాంతంలో శాంతిభద్రతలను తీవ్రంగా దిగజార్చుతున్నాయని మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.