అటార్నీ జనరల్ రోజర్ మారియాకా అరెస్ట్, డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలు
సూర్య అంతర్జాతీయ డెస్క్: బొలివియాలో రాజకీయంగా మరియు న్యాయ వ్యవస్థలో తీవ్ర కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. దేశ అటార్నీ జనరల్ రోజర్ మారియాకాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికా ప్రభుత్వం ఆయన వీసాను రద్దు చేసి, డ్రగ్స్ అక్రమ రవాణా ముఠాలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ అరెస్ట్ జరగడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. దేశంలోని శాంతా క్రూజ్ నగరంలోని విరు విరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు బొలివియా అంతర్గత మంత్రిత్వ శాఖ వర్గాలు ధృవీకరించాయి.
అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల బొలివియా, కొలంబియా, ఈక్వెడార్ దేశాలకు చెందిన దాదాపు ఇటుమందికి పైగా అధికారులపై కఠిన ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగానే అటార్నీ జనరల్ రోజర్ మారియాకా లంచాలు తీసుకుంటూ డ్రగ్స్ రవాణాకు సహకరించారని, హింసాత్మక నేరస్తులు చట్టం నుంచి తప్పించుకునేందుకు సాయపడ్డారని వాషింగ్టన్ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే తనపై వస్తున్న ఆరోపణలను మారియాకా పూర్తిగా ఖండించారు. అమెరికా చర్య కేవలం రాజకీయ వత్తిడితో కూడిన జోక్యమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన స్థానంలో సీనియర్ ప్రాసిక్యూటర్ లూయిస్ మోంటానో మోరలెస్ తాత్కాలిక అటార్నీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.