telanagana
సూర్య మసాలా కంపెనీపై కాలుష్య ఆరోపణలు
Telanagana
01 Oct 2026
41 views
By సూర్య ప్రతినిధి
Updated : 01 Oct 2026 19:11 IST
Select Suryaa Now
వ్యర్థజలాలతో దుర్వాసన.. మొక్కలు ఎండిపోయాయని స్థానికుల ఆవేదన
నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్
మేడ్చల్,మేజర్ న్యూస్( అక్టోబర్ 1): పూడూరు–కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని కిష్టాపూర్‌లో ఉన్న సూర్య మసాలా కంపెనీ నుంచి వ్యర్థజలాలు బయటకు వస్తున్నాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ నుంచి వెలువడుతున్నట్లు చెబుతున్న వ్యర్థజలాలను రోడ్డు పక్కన వదులుతున్నారని, దీంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.సూర్య మసాలా కంపెనీ పరిసరాల్లో రోడ్డు పక్కన వ్యర్థజలాలు నిలిచిపోవడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఈ నీటి ప్రభావంతో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు కూడా ఎండిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*ETP వ్యవస్థపై స్పష్టత ఇవ్వాలి
సూర్య మసాలా కంపెనీలో వ్యర్థజల శుద్ధి వ్యవస్థ (ETP/STP) ఉందా? ఉంటే అది సక్రమంగా పనిచేస్తుందా? బయటకు వస్తున్న నీటిలో రసాయనాలు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు సమగ్రంగా తనిఖీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. కంపెనీ నుంచి వెలువడుతున్నట్లు చెబుతున్న నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
*అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ), సంబంధిత మున్సిపల్ అధికారులు సూర్య మసాలా కంపెనీ పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. కంపెనీ పర్యావరణ అనుమతులు, వ్యర్థజలాల నిర్వహణ విధానాలు, శుద్ధి వ్యవస్థ పనితీరును తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరోపణలు పరీక్షల్లో నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రిపోర్టర్ తలారి శివకుమార్.