BREAKING
భారత్‌లో ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తున్న పెప్సికో, మాన్స్టర్ వెనిజులాలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న ఐఎంఎఫ్ స్పష్టీకరణ ఇజ్రాయెల్ సెటిలర్ల కాల్పుల్లో పాలస్తీనా వ్యక్తి మృతి కోనసీమ ముఖద్వారం రావులపాలెంకు ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ అవార్డు రేపు ధర్మవరం, పుట్టపర్తిలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన * స్వచ్ఛభారత్, చెక్కుల పంపిణీతో పాటు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్ర సత్య కుమార్ యాదవ్ ధర్మవరం/పుట్టపర్తి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే జారే... ... బ్రెజిల్‌లో తుది దశకు ఎన్నికల వేడి - చివరి టీవీ డిబేట్‌ను బహిష్కరించిన అధ్యక్షుడు లూలా గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా ఆత్మకూరు క్రీడావికాస కేంద్రం అటార్నీ జనరల్ రోజర్ మారియాకా అరెస్ట్, డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలు వైసీపీ నుంచి టీడీపీ లోకి భారీ చేరికలు .....పదవుల కోసం కాదు... చిన్న శ్రీను వెంటే...... 1998 తర్వాత గరిష్ట స్థాయికి గిల్ట్ ఈల్డ్స్, కుప్పకూలిన బ్యాంకుల షేర్లు 30వ వార్డు సమస్యలపై శిరీషా ఫోకస్ కిల్‌సెక్ హ్యాకర్ గ్రూప్ 16 ఏళ్ల లీడర్‌ను అరెస్ట్ చేసిన స్పానిష్ పోలీసులు కోనసీమ వాసుల దశాబ్దాల కలకు ఊతం.. నోటీస్ ఇవ్వకుండానే భూమి బదలాయింపు ఎలా? * తీవ్ర అన్యాయం జరిగిందంటూ భావిశెట్టి శేఖర్ ఆరోపణ

కూటమిలో గ్రూపుల గుబులు..!

Select Suryaa Now
కూటమిలో గ్రూపుల గుబులు..!
  • అచ్చెన్న–కూన వర్గాల మధ్య విభేదాలు..
  • రాజకీయ, సామాజిక సమీకరణాలే ప్రధాన సవాలుగా మారుతున్నాయా?
  • స్థానిక ఎన్నికల వేళ కేడర్‌లో అయోమయం..
  • నాయకత్వానికి కొత్త చిక్కులు

శ్రీకాకుళం, సూర్య బ్యూరో: సిక్కోలు జిల్లా తెలుగుదేశం పార్టీకి బలమైన రాజకీయ స్థావరంగా ఉన్నప్పటికీ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతర్గత గ్రూపు రాజకీయాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ వర్గాల మధ్య నెలకొన్న రాజకీయ ఆధిపత్య పోరు కూటమి సమన్వయానికి సవాల్‌గా మారుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనికి రాజకీయంతో పాటు సామాజిక సమీకరణాలు కూడా తోడవుతున్నాయని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
ఆధిపత్య పోరుతో ఎవరికి లాభం?
నియోజకవర్గాల పరిధిలో తమ ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు, పరస్పర వర్గాల వ్యవహారాల్లో జోక్యం, అనుకూల వర్గాలకు ప్రాధాన్యం వంటి అంశాలు క్రమంగా అసంతృప్తికి కారణమవుతున్నాయనే ప్రచారం ఉంది. కొన్నిచోట్ల అధికార యంత్రాంగం సైతం రాజకీయ వర్గాల మధ్య సమతుల్యత పాటించాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోందనే చర్చ వినిపిస్తోంది. ఒకే కూటమిలో ఉన్న నేతల మధ్య సమన్వయం కంటే ఆధిపత్యమే ముందుకు వస్తే దాని ప్రభావం చివరకు కేడర్‌పైనే పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
స్థానిక ఎన్నికల వేళ మరింత వేడి..
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ అంతర్గత సమీకరణాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గ్రామస్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు అభ్యర్థుల ఎంపిక, పార్టీ బలగాల సమీకరణ, స్థానిక నాయకత్వంపై పెత్తనం వంటి అంశాలు గ్రూపుల మధ్య పోటీకి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్టీ సమన్వయ సమావేశంలోనూ ఈ అంతర్గత విభేదాలు పరోక్షంగా చర్చకు వచ్చినట్లు సమాచారం.
సమన్వయంపై నాయకత్వం దృష్టి
నియోజకవర్గాల్లో సమన్వయం లోపిస్తోందని కొందరు ఎమ్మెల్యేలు మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో నెలకొన్న వర్గపోరు పూర్తిగా సమసిపోయిందా అన్నది మాత్రం ప్రశ్నగానే మిగిలింది.
ప్రతిపక్షంతో సన్నిహితాలపైనా చర్చ
గ్రూపు రాజకీయాల నేపథ్యంలో కొందరు నాయకులు ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నేతలతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా సమావేశాల సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఒక వర్గం మరో వర్గాన్ని దెబ్బతీసేందుకు తీసుకునే రాజకీయ వ్యూహాలు చివరకు కూటమి ప్రయోజనాలకే విఘాతం కలిగించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాబోయే ఎన్నికలపై ప్రభావం?
స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రాబోయే మూడేళ్లలో వరుసగా ఎదురయ్యే రాజకీయ పరీక్షలను దృష్టిలో పెట్టుకుంటే కూటమి నేతల మధ్య సమన్వయం కీలకంగా మారింది. ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవాల్సిన సమయంలో సొంత శిబిరాల మధ్యే ఆధిపత్య పోరు కొనసాగితే క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం దెబ్బతినే ప్రమాదం ఉందనే ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
అంతర్గత విభేదాలను నాయకత్వం ఎంత త్వరగా చక్కదిద్దుతుంది? సామాజిక, రాజకీయ సమీకరణాలను పక్కనపెట్టి కూటమి నేతలను ఒకే వేదికపైకి తీసుకురాగలదా? స్థానిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు, కేడర్‌ సమీకరణలో ఏ వర్గానికి ఎంత ప్రాధాన్యం లభిస్తుంది?
ఇప్పుడు సిక్కోలు రాజకీయాల్లో ఇవే ఆసక్తికరమైన ప్రశ్నలుగా మారాయి.