ఘనంగా జీఎంసీ బాలయోగి 75వ జయంతి వేడుకలు..
అమలాపురం మేజర్ న్యూస్ మాజీ లోక్‌సభ స్పీకర్, దివంగత నేత జీఎంసీ బాలయోగి 75వ జయంతి వేడుకలు అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. అమలాపురంలోని బాలయోగి ఘాట్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన తనయుడు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిరాజు, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీలు, కూటమి నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలయోగి ఘాట్ వద్ద ఆయనకు నివాళులర్పించిన ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్యేలు అనంతరం 75 కిలోల కేక్‌ను కట్ చేశారు.కోనసీమ రైల్వే లైన్‌పై ఎంపీ హరీష్ బాలయోగి కీలక ప్రకటన చేశారు. కోనసీమ రైల్వే లైన్ పూర్తి చేయడం తన తండ్రి జీఎంసీ బాలయోగి చిరకాల కోరిక అని, ఆ కలను సాకారం చేసి తీరుతానని తెలిపారు.
రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన రాష్ట్ర వాటాలో తొలి విడతగా రూ.100 కోట్లు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని చెప్పారు. త్వరలోనే ఈ నిధులు విడుదల కానున్నాయని తెలిపారు.
రూ.100 కోట్లతో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి, అనంతరం కేంద్ర వాటా నిధులను తీసుకువచ్చి కోనసీమ రైల్వే లైన్ పనులను వేగవంతం చేస్తామని ఎంపీ హరీష్ బాలయోగి వెల్లడించారు.
బాలయోగి 75వ జయంతి సందర్భంగా కోనసీమ ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా మూడు అత్యాధునిక అంబులెన్సులను ఏర్పాటు చేయడంతో పాటు మూడు వేల మందికి హెల్త్ కార్డులు చేయించినట్లు తెలిపారు.త్వరలో బాలయోగి 75 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు.