పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా: సర్పంచ్ సంధ్యా సుభాష్ గౌడ్
మోమిన్‌పేట, మేజర్ న్యూస్: పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన లక్ష్యమని మోమిన్‌పేట గ్రామ సర్పంచ్ సంధ్యా సుభాష్ గౌడ్ తెలిపారు. బుధవారం మోమిన్‌పేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆమె ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తికి అనుకోని ప్రమాదం జరిగినా, సహజ మరణం సంభవించినా ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, బీమాకు అర్హులైన కుటుంబ పెద్ద పేరుతో నమోదు చేస్తామని వివరించారు. బీమా పొందిన వ్యక్తి సహజంగా లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబంలోని నామినీకి రూ.5 లక్షల పరిహారం అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి మల్లేశం గౌడ్ లబ్ధిదారుల వివరాలను పంచాయతీ లాగిన్‌లో నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి, వార్డు సభ్యులు మహమ్మద్ అప్సర్, శోభన్, రమేష్, అంజి, పాండు, సురేష్, అరిగె సూరి, అంజన్న, జాఫర్, సాదిక్, గ్రామస్తులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.