కూతురి పెళ్లి కోసం దాచిన రూ.10 లక్షలు మ్యూచువల్ ఫండ్స్‌లోకి మళ్లించారంటూ ఆరోపణ.. వడ్డీ రాక.. అసలులో కోతలంటూ బాధితుడి ఆవేదన
వికారాబాద్, మేజర్ న్యూస్: కూతురి పెళ్లి కోసం ఎంతో కష్టపడి కూడబెట్టిన రూ.10 లక్షలను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడానికి వికారాబాద్ ఎస్‌బీఐ ప్రధాన శాఖకు వెళితే, అధిక వడ్డీ వస్తుందంటూ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టించారని, ఇప్పుడు అవసరమైన సమయంలో సొంత డబ్బులు తీసుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని మొమిన్‌పేట మండలం మొరంగపల్లి గ్రామానికి చెందిన నేరెడు శ్రీనివాస్ ఆరోపించారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాల్సిన బ్యాంకులోనే ఇలాంటి పరిస్థితి ఎదురవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నేరెడు శ్రీనివాస్ గత పదేళ్లుగా వికారాబాద్ ఎస్‌బీఐలో ఖాతా నిర్వహిస్తున్నారు. తన రెండో కుమార్తె వివాహం కోసం ఎంతో కష్టపడి రూ.10 లక్షలు పొదుపు చేశారు. గత జనవరిలో ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనే ఉద్దేశంతో బ్యాంకుకు వెళ్లారు. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో వచ్చే వడ్డీ కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందని బ్యాంకు మేనేజర్ సూచించినట్లు బాధితుడు తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్‌పై తనకు అవగాహన లేకపోయినా, బ్యాంకు మేనేజర్ చెప్పిన మాటలను నమ్మి పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించారు. తనకు హిందీ రాదని, సంబంధిత అధికారికి తెలుగు రాదని, దీంతో పెట్టుబడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోలేకపోయానని పేర్కొన్నారు.11 నెలల అనంతరం కుమార్తె పెళ్లి కోసం బంగారం కొనుగోలు చేయాలని బుధవారం బ్యాంకుకు వెళ్లిన శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. పెట్టుబడిపై ఆశించిన వడ్డీ రాకపోగా, అసలు మొత్తంలోనే రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు కోత విధించి చెల్లిస్తామని బ్యాంకు అధికారులు చెప్పినట్లు ఆరోపించారు. వెంటనే డబ్బులు ఇవ్వాలని కోరగా, మూడు రోజుల తర్వాత రావాలని సూచించినట్లు తెలిపారు. పెట్టుబడి పెట్టే సమయంలో అవసరమైనప్పుడు డబ్బులు తీసుకోవచ్చని భరోసా ఇచ్చారని, ఇప్పుడు కూతురి పెళ్లి సమయంలో తన సొంత డబ్బుల కోసం బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తోందని కన్నీటిపర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ బ్యాంకు వద్దే నిరీక్షించారు.ఇదిలా ఉండగా, వికారాబాద్ ఎస్‌బీఐ శాఖలో వ్యక్తిగత రుణాల కోసం వెళ్లే ఖాతాదారులకు ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇన్సూరెన్స్ చేయించుకుంటేనే రుణం మంజూరవుతుందని కొందరు సిబ్బంది చెబుతున్నారని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణాల కోసం వచ్చే వారిపట్ల కొందరు సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వ్యాపారవేత్తలు సైతం మెరుగైన సేవల కోసం తమ ఖాతాలను ఇతర బ్యాంకులకు బదిలీ చేసుకున్నట్లు సమాచారం.బాధితుడి సమస్యపై వివరణ కోరేందుకు బ్యాంకు మేనేజర్‌ను కలిసేందుకు ప్రయత్నించగా, సమావేశంలో ఉన్నారనే సమాధానం రావడంతో వేచి చూడాల్సి వచ్చిందని శ్రీనివాస్ తెలిపారు. ఖాతాదారుల నుంచి వివిధ సేవల పేరుతో వసూళ్లు చేస్తున్న బ్యాంకు, వారికి అవసరమైన సమయంలో సేవలు అందించడంలో ఎందుకు జాప్యం చేస్తోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్‌తో పాటు ఎస్‌బీఐ ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని బాధితుడు కోరుతున్నారు. తన పెట్టుబడికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించి, నిబంధనల ప్రకారం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయిస్తానని నేరెడు శ్రీనివాస్ స్పష్టం చేశారు.