కేశవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఉన్నట్టా.. లేనట్టా..?:కౌన్సిలర్ కొంపల్లి మాధవి భూమేష్ గౌడ్
శామీర్‌పేట, మేజర్ న్యూస్: మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవరం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతుండగా, క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చినా ధాన్యం విక్రయించేందుకు సరైన వసతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 24వ వార్డు కౌన్సిలర్ కొంపల్లి మాధవి భూమేష్ గౌడ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2016 నుంచి 2025 వరకు కేశవరం గ్రామంలోనే ధాన్యం కొనుగోళ్లు జరిగాయని, ఈ ఏడాది మాత్రం రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్ స్వగ్రామంలోనే ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం విచారకరమన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కేశవరంలో ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.మరోవైపు సంబంధిత అధికారులను వివరణ కోరగా.. మూడు చింతలపల్లి మండలంలోని ఉద్దెమర్రి, కేశవరం, లక్ష్మాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, అయితే రైతులు ధాన్యం విక్రయించేందుకు కేంద్రాలకు రావడం లేదని తెలిపారు. అధికారులు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతుండగా, రైతులు మాత్రం కొనుగోళ్లు జరగడం లేదని చెబుతుండటంతో కేశవరంలో కొనుగోలు కేంద్రం వాస్తవంగా పనిచేస్తోందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి, రైతుల సమస్యలను పరిష్కరించి ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ మాధవి భూమేష్ గౌడ్ కోరారు.