హిమాయత్ నగర్ ,మేజర్ న్యూస్ : ఈ నెల 27న తెలంగాణ రాష్ట్ర ఆటో, క్యాబ్ డ్రైవర్ల జేఏసీ ఆధ్వర్యంలో జరిగే రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి మహాత్మా గాంధీ తెలంగాణ ఆటో డ్రైవర్ల జేఏసీ మద్దతు ఉంటుందని రాష్ట్ర కన్వీనర్ అమానుల్లా ఖాన్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం హైదర్గూడా ఎన్ ఎస్ ఎస్ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆటో జేఏసీ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రంలో మాదిరి ఆటో మీటర్ రేట్లు ఉండాలని, నగరంలో అనుమతించిన గ్రీన్ క్యాబ్ లను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మూడేళ్లు గడిచిన ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గం అన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు దుర్మరణం చెందిన ఆర్టీసీ కండక్టర్ ప్రవల్లిక కు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలను ఎక్స్ గ్రేషియా కింద అందించింది అన్నారు. కానీ ఆటో డ్రైవర్లు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవకపోవడం విడ్డూరం అన్నారు. ఆటో డ్రైవర్లు ఐక్యతతో హక్కులను సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తాము చేపట్టిన ఈనెల 30న జరిగే ఆటోల బందు ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా 27న చేపట్టే కమిషనర్ కార్యాలయం ముట్టడి పోస్టర్ ను నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు ఎస్.కె జి జమాల్, ముజాహిద్ హస్మి రమేష్, ఎండి ఖలీల్ ఉల్లా, మహమూద్, ఫిరోజ్ ఖాన్, సయ్యద్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు