telangana
భూదాన భూములకు వారసులు భూమిలేని నిరుపేదలు మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ :ఆచార్య వినోబా భవే భూస్వాముల నుండి విరాళాల రూపంలో భూమిలేని నిరుపేదల కోసం సేకరించిన భూదాన భూముల వారసులు భూమిలేని నిరుపేదలేనని, ఆ భూములపై పేదలకే హక్కు ఉంటుందని సిపిఐ సీనియర్ నాయకులూ, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా అన్నారు. తెలంగాణ సర్వోదయ మండలి హైదరాబాద్ పాత నగర కమిటీ ప్రథమ మహాసభ బషీర్ బాగ్ దేశోద్ధారక భవన్ లో బుధవారం తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర అధ్యక్షులు ఆర్. శంకర్ నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ మహా సభను సయ్యిద్ అజీజ్ పాషా ప్రారంభించి ప్రసంగిస్తూ రాష్ట్రంలో లక్షలమంది ఆశ్రయం లేని నిరుపేదలు ఉన్నారని, వారికీ గూడు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. భూదాన భూములను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని పంపిణి చేయాలనీ కోరారు. వేల కోట్ల విలువైన భూదాన భూములు గత ప్రభుత్వాల ఉదాసీన వైఖరి వల్ల కబ్జాలకు గురయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఎకరాల భూదాన భూములను రాష్ట్ర ప్రభుత్వం భూదాన యజ్ఞ బోర్డు ఏర్పాటు చేసి గ్రామాల్లో భూమిలేని నిరుపేదలకు సాగు కోసం, పట్టణాల్లో ఇళ్ళు లేని నిరుపేదలకు ఇళ్ల కోసం పంపిణి చేయాలనీ అన్నారు. రాష్ట్రంలోని వేలాది ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతమైతున్నాయని, ఈ భూములను ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని పేద ముస్లింలకు పంపిణి చేయాలనీ సయ్యిద్ అజీజ్ పాషా విజ్ఞప్తి చేసారు. ఆర్. శంకర్ నాయక్ మాట్లాడుతూ పోరాటాలు చేస్తేనే పేదలకు భూదాన భూములు దక్కుతాయని, లేకుంటే పేదలకు చెందవలసిన భూదాన భూములు కబ్జాదారుల పాలవుతాయని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వందల ఎకరాల భూదాన భూములు పంపిణి చేయకుండా ఉన్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి, నగర పరిధిలోని ఇళ్లులేని ప్రతియొక్క నిరుపేదలకు 100 గజాల చొప్పున పంపిణీ చేయాలనీ ఆర్. శంకర్ నాయక్ కోరారు. ప్రముఖ సామాజికవేత్త ఆర్. గోపాల్, మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై గిరిప్రసాద్, నేతలు రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సర్వోదయ మండలి హైదరాబాద్ పాత నగర కమిటీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.నూతన జిల్లా అధ్యక్షుడు ఎండి. గౌస్ ఖాన్ ,ప్రతినిధి,- మహమూద్ మహబూబ్,జిల్లా ఉపాధ్యక్షులు- అమీనా, జిల్లా ప్రధాన కార్యదర్శి -శ్యాం అబ్రహం
సహాయ కార్యదర్శి, -సుజాత ,కోశాధికారి- అఖిల్ ,మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు- షహీన్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు -ఫయాజ్ ,జిల్లా
కార్యదర్శి -లక్ష్మణ్ తదితరులను నూతన కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకటించడం జరిగింది