4.11 ఎకరాల్లో రెండు టవర్లు
మొత్తం 4.11 ఎకరాల స్థలంలో 2,41,540 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో రెండు టవర్లను చేపట్టనున్నారు. వీటిలో ఒకటి జీ+6, మరొకటి జీ+8 అంతస్తులతో నిర్మించనున్నారు. రెండు భవనాలను అనుసంధానిస్తూ ప్రస్తుత, భవిష్యత్తు పరిపాలనా అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించారు.ఈ సముదాయంలో కౌన్సిల్ హాల్, ప్రజావాణి హాల్, పౌర సేవా కేంద్రాలు, ఆడిటోరియం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, అనుబంధ సంస్థలకు ప్రత్యేక కార్యాలయాలు కేటాయించనున్నారు. కౌన్సిల్ హాల్‌లో 195 మంది, ఆడిటోరియంలో 400 మంది కూర్చునేలా సదుపాయాలు కల్పించనున్నారు. ఏడో అంతస్తులో 1,311 చదరపు అడుగుల విస్తీర్ణంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు.ప్రస్తుతం హైటెక్స్ సమీపంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ భవనంలో సీఎంసీ కార్యాలయం తాత్కాలికంగా కొనసాగుతోంది. కొత్త భవన సముదాయం అందుబాటులోకి వస్తే వివిధ పరిపాలన విభాగాలన్నీ ఒకేచోట నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. దీంతో ప్రజలకు మున్సిపల్ సేవలు మరింత సులభంగా అందే అవకాశం ఉంటుంది.