కోడుమూరు సర్పంచ్ బరిలో హైకోర్టు న్యాయవాది సోమశేఖర్ యాదవ్ కొండపేటలో ఇంటింటి ప్రచారం.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమని హామీ
కోడుమూరు మేజర్ న్యూస్ :కోడుమూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో హైకోర్టు న్యాయవాది వై. సోమశేఖర్ యాదవ్ నిలిచారు. ఈ సందర్భంగా బుధవారం కొండపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలిశారు. తనకు ఒక అవకాశం కల్పించి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
ఉన్నత విద్యావంతుడిగా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకుని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. కోడుమూరు పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచడం, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు.
గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధి అంటే ఏమిటో ఆచరణలో చూపిస్తానని సోమశేఖర్ యాదవ్ ఓటర్లను కోరారు.