గ్రామపంచాయతీ తొలి దశ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఆదేశించారు
బాపట్ల, మేజర్‌న్యూస్ :
గ్రామపంచాయతీ తొలి దశ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఆదేశించారు. గ్రామపంచాయతీ, బాపట్ల మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి అధికారులతో ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు.
గ్రామపంచాయతీ ఎన్నికలలో శాంతిభద్రతలకు ఎలాంటి విగాథం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. పోలింగ్ కేంద్రంలో ఎవరైనా ఇబ్బందులు పెట్టిన, ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే వారిని అరెస్టు చేసే అధికారాలు ప్రిసైడింగ్ అధికారికి ఉంటాయన్నారు. అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే వారిని అరెస్టు అరెస్టు చేసే అధికారాలు రిటర్నింగ్ అధికారికి ఉంటాయన్నారు. మీ అధికారాలను జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. గెలుపొందిన వార్డు సభ్యులు సర్పంచ్లకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి వాటిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎన్నికల విధులకు ఎవరైనా గైర్హాజరైతే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. తక్షణమే వారికి షోకాస్ నోటీస్ జారీ చేయాలన్నారు.
వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ప్రతి గ్రామ పంచాయతీలోని పోలింగ్ కేంద్రాలలో టార్పాలిన్ పట్టలు సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. రిటర్నింగ్ అధికారులు, రూట్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లు, పిఓలు, ఏపీవోలు, ఓపిఓలు సమర్థంగా తమ విధులు నిర్వర్తించాలన్నారు. ప్రతి పంచాయతీలో పోలింగ్ కేంద్రం వద్దనే ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం గాకుండా అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బందికి సౌకర్యాలను ఎంపీడీవోలు కల్పించాలన్నారు.
సమస్యాత్మక, తీవ్రసమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే 229 సీసీ కెమెరాలు, మరికొన్ని వెబ్ కాస్టింగ్, ప్రత్యేకంగా వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సామాగ్రి కేటాయించే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పనిచేసిన ఉద్యోగులనే రిసెప్షన్ సెంటర్లలో నియమించాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో విధులు నిర్వహించే ఉద్యోగులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉప సర్పంచ్ ఎన్నికలకు తప్పనిసరిగా 50శాతం కోరం ఉండేలా అధికారులు సమయస్పూర్తితో చర్యలు తీసుకోవాలన్నారు. రెండు, మూడు దశలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలోనూ ఏకగ్రీవమైన వాటిని మిళితం చేయాలన్నారు. ముఖ్యంగా ఆర్డీవోలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. శాంతిభద్రతల బాధ్యత పూర్తిగా పోలీసులపైనే ఆధారపడకుండా ఆర్డీవోలు పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు స్వేచ్ఛగా ఓటు వేయడానికి ప్రత్యేక సెలవు దినంగా వర్తింప చేయాలన్నారు. తదుపరి బ్యాలెట్ పత్రాల లెక్కింపు, అర్హత ఉన్న బ్యాలెట్ పత్రాల గుర్తింపు, అనర్హమైన బ్యాలెట్ పత్రాలను తొలగించే ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఎన్నికలు ముగిసిన తదుపరి సిబ్బందికి అక్కడే పారిపోషకం ఇవ్వాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, డిపిఓ నగేష్ కుమారి, డీఈఓ శ్రీనివాస్ సింగ్, డి ఆర్ డి ఏ పీడీ సింగయ్య, జెడ్పీ సీఈవో విజయలక్ష్మి, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.