పదవీ విరమణ సందర్భంగా పాఠశాలకు కళావేదిక, పోడియం వితరణ..
నరసన్నపేట, అక్టోబర్ 1 మేజర్ న్యూస్: నరసన్నపేట మండలం సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా సేవలందించిన సీమ భీమారావు పదవీ విరమణ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. పదవీ విరమణ పొందిన భీమారావుకు పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు సాదర స్వాగతం పలికి సత్కరించారు.
ఈ సందర్భంగా భీమారావు తన సేవలకు గుర్తుగా పాఠశాలకు సుమారు రూ.లక్ష విలువైన కళావేదిక, పోడియంను వితరణగా అందజేశారు. పాఠశాలలో సాంస్కృతిక, విద్యా కార్యక్రమాల నిర్వహణకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని హెచ్ఎం వకులా రత్నమాల, ఉపాధ్యాయులు తెలిపారు.
పాఠశాలకు తన వంతుగా విలువైన సామగ్రిని అందించిన భీమారావును ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, భీమారావు స్నేహితులు, సన్నిహితులు, సిఆర్ఎంటి పెద్దవాడు తదితరులు పాల్గొన్నారు.