మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి
ఎస్పీ స్నేహ మెహ్రా
మహిళ పీఎస్ ను వార్షిక తనిఖీ చేసిన ఎస్పీ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్( అక్టోబర్ 5): మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం జిల్లా ఉమెన్ పోలీస్ స్టేషన్‌ను ఆమె తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్టేషన్‌లోని వివిధ విభాగాలు, రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, ఫిర్యాదుల పరిష్కార స్థితిగతులను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. కేసులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలిస్తూ దర్యాప్తు ఏ దశలో ఉందనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.మహిళలకు సంబంధించిన కేసుల్లో సత్వర స్పందన, సమర్థవంతమైన దర్యాప్తుతో బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, బాలికల నుంచి వచ్చే ఫిర్యాదులను సున్నితంగా స్వీకరించి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును వేగవంతం చేయాలని, నిర్దేశిత సమయంలో కేసులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో పాటు సీసీటీఎన్‌ఎస్, ఈ-సాక్ష్య తదితర పోలీస్ సాంకేతిక వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించాలని తెలిపారు.
స్టేషన్‌లోని కేసు డైరీలు, రిజిస్టర్లు, ఫిర్యాదుల నమోదు, దర్యాప్తు పత్రాలను పరిశీలించిన ఎస్పీ.. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. స్టేషన్ పరిసరాల్లో పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, సిబ్బంది విధుల నిర్వహణను కూడా పరిశీలించారు.
మహిళలకు పోలీస్ శాఖపై మరింత నమ్మకం కలిగేలా మహిళా అనుకూల పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. మహిళలు తమ సమస్యలను ఎలాంటి భయాందోళన లేకుండా పోలీసులను ఆశ్రయించేలా నమ్మకమైన వాతావరణాన్ని కల్పించాలని తెలిపారు. ప్రజలతో, ముఖ్యంగా మహిళలతో సిబ్బంది స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆదేశించారు.అనంతరం ఉమెన్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో ఎస్పీ మాట్లాడి వారి విధులు, ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరమైన సదుపాయాల గురించి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు.ఈ తనిఖీలో ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రామ్ నాయక్, ఎస్‌ఐ అనితతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.