మానవత్వమే మనిషి నిజమైన చిరునామా
సదానందం కుటుంబానికి ఉద్యోగుల జేఏసీ రూ.3.65 లక్షల ఆర్థిక సహాయం
సూర్య కరీంనగర్: జిల్లా కలెక్టర్ డ్రైవర్ సదానందం సతీమణి నీరజాక్షి ఇటీవల ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన నేపథ్యంలో, కరీంనగర్ జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సమకూర్చిన రూ.3.65 లక్షల ఆర్థిక సహాయాన్ని బుధవారం తిమ్మాపూర్‌లోని వారి నివాసంలో కుటుంబ సభ్యులకు అందజేశారు. జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు కుటుంబాన్ని పరామర్శించి, దశదినకర్మ సందర్భంగా చెక్కును అందించారు. ఉద్యోగులు చిన్నస్థాయి నుంచి అధికారుల వరకు స్పందించి ఫోన్‌పే, గూగుల్‌పే తదితర మార్గాల్లో సహాయం అందించడం ఉద్యోగ ఐక్యతకు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. ఆపదలో ఉన్న ఉద్యోగ కుటుంబాలకు భవిష్యత్తులోనూ అండగా నిలుస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎడ్ల అరవింద్ రెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్, రాష్ట్ర నాయకులు సర్దార్ హర్మేందర్ సింగ్, పట్టణ అధ్యక్షుడు మారుపాక రాజేష్ భరద్వాజ్, డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు వారిస్ సవాబ్, నాయకులు మంజీత్ సింగ్, అనంత్ రెడ్డి, అన్వర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నీరజాక్షి ఆత్మకు శాంతి చేకూరాలని, సదానందం కుటుంబానికి మనోధైర్యం కలగాలని వారు ఆకాంక్షించారు.