ఇసుక లారీల దుమ్ముతో వ్యాపారుల ఇక్కట్లు
వాటర్ క్యూరింగ్ చేయాలని తహసీల్దార్‌కు వినతి.
వెంకటాపురం నూగూరు ప్రతినిధి, ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రధాన ఆర్ అండ్ బి రహదారిపై ఇసుక లారీల రాకపోకలతో తీవ్రంగా దుమ్ము లేస్తోందని,దీంతో వ్యాపారాలు చేసుకోలేకపోతున్నామని చాంబర్ ఆఫ్ కామర్స్ ఆందోళన వ్యక్తం చేసింది.మండల కేంద్రంలో శివాలయం నుంచి ఇండియన్ పెట్రోల్ బంక్ వరకు ఉన్న ప్రధాన రహదారి వెంబడి వందలాది మంది వ్యాపారాలు నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నారని,రోజూ వందల సంఖ్యలో ఇసుక లారీలు తిరగడంతో దుమ్ము ధూళితో దుకాణాల్లో కూర్చోలేకపోతున్నామని పేర్కొన్నారు.దుమ్ము కారణంగా శ్వాసకోశ వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నామని వాపోయారు.ప్రభుత్వం ఇసుక లారీల ద్వారా వచ్చే ఆదాయం పైనే దృష్టి సారిస్తోందని,ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.ఈ నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి రెండు గంటలకు ఒకసారి చొప్పున రోజుకు ఐదుసార్లు వాటర్ క్యూరింగ్ చేయించేలా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని బుధవారం తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.వారం రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ వినతిపత్రం ప్రతులను జిల్లా కలెక్టర్,ఎంపీడీవో, సీఐ,ఎస్‌ఐ, గ్రామ పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. వినతిపత్రం అందించిన వారిలో బచ్చు పూర్ణచందర్రావు,శనిగల నరసింహారావు,బజ్జుర్ల వెంకటేశ్వర్లు (బివిఆర్),చిట్టెం టాకయ్య,ఏవిటి వెంకట్, పూజారి ఉదయ్ కిరణ్,తదితరులు ఉన్నారు.