స్థలాల కోసం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు బంజేయ్..
సూర్య, వేములవాడ:యూనియన్ల పేరిట బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ జర్నలిస్టుల మధ్య చిచ్చుపెట్టే విధానం మార్చుకోవాలని వేములవాడ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు దాసరి దేవేందర్ హితవు పలికారు. వేములవాడ మున్సిపాలిటీ నాంపల్లి పరిధిలోని జర్నలిస్టు కాలనీని రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సందర్శన కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో చేసుకుంటున్న ప్రచారంపై స్పందిస్తూ, ప్రభుత్వ విప్ జర్నలిస్టు కాలనీ సందర్శన కార్యక్రమం వ్యక్తిగతం కాదని, అదేవిధంగా యూనియన్లకు కూడా సంబంధించినది కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి ప్రభుత్వ నిధులు ఉపయోగించలేదని, జర్నలిస్టు కాలనీలో పట్టాలు పొందిన ప్రతి విలేఖరి ఇందులో పాల్గొనాల్సి ఉండగా, రాజకీయాల కోసం కొంతమంది వ్యక్తులు దీనికి దూరంగా ఉన్నట్లు ప్రకటించుకోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. సదరు యూనియన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా చెప్పుకుంటున్న కొలిపాక నరసయ్యకు జర్నలిస్టు కాలనీతో సంబంధం లేదని, అతనికి ప్రభుత్వం ఇప్పటివరకు ఇంటి పట్టా కేటాయించలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి పట్టా మంజూరు కానప్పటికీ, మరో వ్యక్తి స్థలంలో నరసయ్య ఇంటి నిర్మించుకుంటున్నట్లు సమాచారం ఉన్నదని, అక్రమంగా కొనసాగుతున్న ఈ వ్యవహారంపై అధికారులు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న నాయకుడు తనకు మంజూరైన పట్టాను కుటుంబ సభ్యుల పేరిట మార్పించినట్లు ప్రాథమిక సమాచారం ఉన్నదని, నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన ఈ వ్యవహారం పైన సైతం విచారణ జరిపించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను కోరుతామని తెలిపారు. మీడియాతో సంబంధం లేని వ్యక్తులను వెంట వేసుకొని తిరుగుతూ, కేవలం ఉనికి కోసం చేస్తున్న ఇలాంటి విమర్శలు మానుకుని జర్నలిస్టు కాలనీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి యూనియన్లకు అతీతంగా సహకరించాలని దాసరి దేవేందర్ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, జర్నలిస్టు కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం నాడు సమావేశం నిర్వహించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశంలో హౌసింగ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఎన్ టి బాబు యాదవ్, ఉపాధ్యక్షుడు తుమ్మనపల్లి జనార్ధన్, గౌరవ సలహాదారు రాపల్లి శ్రీనివాస్, కోశాధికారి దూలం రఘు, జాయింట్ సెక్రటరీ అమరగొండ కిషన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నూగూరి మహేష్, సభ్యులు పాల్గొన్నారు.
-----