గ్రామీణుల ఆరోగ్యమే ప్రాధాన్యత.. ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులోకి తేవడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం:
సూర్య జగిత్యాల ప్రతినిధి:మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్,వెలమ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగారావు తో కలిసి బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి, గ్రామీణ ప్రజలకు వైద్యం అందని పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తోందన్నారు. వైద్యం కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించి, ప్రాథమిక ఆరోగ్య సేవలను గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.సాతారం గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభంతో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యాయని తెలిపారు.
సాధారణ అనారోగ్య సమస్యలకు ప్రాథమిక చికిత్సతో పాటు ఆరోగ్య పరీక్షలు, వైద్య సలహాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే, వ్యాధిని ముందుగానే గుర్తించి నివారించడమే ప్రజారోగ్యంలో కీలకమని అన్నారు. ప్రజలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, చిన్న ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.మహిళలు, గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆరోగ్య సేవలు సకాలంలో అందేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడంతో పాటు ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేయాలని సూచించారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య మౌలిక వసతులు భవనం వరకు పరిమితం కాకుండా ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించే కేంద్రాలుగా పనిచేయాలని అన్నారు. ఉప కేంద్రంలో సిబ్బంది అందుబాటులో ఉండేలా, అవసరమైన సేవలు నిరంతరాయంగా కొనసాగించేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
సాతారం ఆరోగ్య ఉప కేంద్రం అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు సులభతరమయ్యాయని తెలిపారు. ప్రజలకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా వైద్య సిబ్బంది విధులు నిర్వహించాలని సూచించారు.ఉప కేంద్రం పనితీరును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజలకు అందుతున్న వైద్య సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆరోగ్య కార్యక్రమాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
వెలమ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగారావు మాట్లాడుతూ
కోరుట్ల నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటు స్థానిక ప్రజలకు ఉపయోగకరమైన సదుపాయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు భరోసా కలుగుతుందని తెలిపారు.ప్రాథమిక వైద్యం కోసం గ్రామస్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గుతుందని, అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి సంబంధిత శాఖల సమన్వయంతో మరిన్ని అభివృద్ధి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పెల్లి ఆర్డీవో నరసింహారావు, డీఎం అండ్ హెచ్‌ఓ సుజాత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, మండల తహసీల్దార్, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.