కేరళ పాఠశాలలో వైభవంగా బతుకమ్మ వేడుకలు
సూర్య, లక్షెట్టిపేట/ మంచిర్యాల జిల్లా ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల సహజసిద్ధమైన పూలతో అందమైన బతుకమ్మలను తయారుచేసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడారు. చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ.. బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి ప్రతీక అని తెలిపారు. సహజసిద్ధమైన పూలను ఉపయోగించడం ద్వారా ప్రకృతి పట్ల ప్రేమ, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించవచ్చన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులకు మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం తెలియడంతో పాటు ఐక్యత, సోదరభావం, కుటుంబ విలువలపై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆనందోత్సాహాలను నింపడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని మరింత పెంచింది. “మన సంస్కృతి మన గర్వం.. మన సంప్రదాయం మన బలం.. మన బతుకమ్మ మన తెలంగాణ ఆత్మ” అనే సందేశంతో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.