ప్రేక్షకుడి పల్స్ తెలిసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. పుట్టినరోజు జరుపుకుంటున్న స్టార్ డైరెక్టర్ మారుతి
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో ప్రేక్షకుల నాడిని కచ్చితంగా పట్టుకుని, వారు కోరుకునే వినోదాన్ని అందించడంలో దిట్ట అయిన ప్రముఖ దర్శకుడు మారుతి నేడు తన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. సినిమా నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారు, ఎలాంటి కథలను చూపిస్తే థియేటర్లలో కడుపుబ్బా నవ్వుకుంటారు అనే విషయంపై అద్భుతమైన అవగాహన ఉన్న అతికొద్ది మంది దర్శకులలో మారుతి ముందు వరుసలో ఉంటారు. చిన్న చిత్రాలతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ప్రొడక్షన్ రంగంలోనూ విశేష అనుభవం గడించి, నేడు టాలీవుడ్‌లో తిరుగులేని సక్సెస్ ఫుల్ నిర్మాతగా మరియు స్టార్ డైరెక్టర్‌గా ఆయన ఎదిగిన వైనం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.
కెరీర్ తొలినాళ్లలో యూత్ ఫుల్ కంటెంట్‌తో పాటు ఒక మంచి సందేశాన్ని జోడించి సినిమాలను తెరకెక్కించవచ్చని నిరూపించిన మారుతి, ఈరోజుల్లో మరియు బస్ స్టాప్ వంటి సినిమాలతో యూత్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి, మారుతి సక్సెస్ గాలివాటం కాదని అందరికీ నిరూపించింది. ఇక నాని హీరోగా తెరకెక్కించిన భలే భలే మగాడివోయ్ సినిమాతో ఆయన పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఘన విజయం సాధించిన ఈ చిత్రం మారుతి కెరీర్‌లో అప్పట్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా, టాలీవుడ్ ప్రముఖ హీరోల దృష్టిని ఆయన వైపునకు మళ్లేలా చేసింది.
ఆ తరువాత శర్వానంద్ హీరోగా తెరకెక్కించిన మహానుభావుడు, సాయిదుర్గ తేజ్ తో రూపొందించిన ప్రతి రోజు పండగే వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని మారుతి స్థాయిని మరింత పెంచాయి. ఇవి కేవలం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ మాత్రమే కాకుండా మానవ విలువలను కూడా చక్కగా చాటిచెప్పిన అద్భుతమైన చిత్రాలుగా నిలిచాయి. ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను నెలకొల్పింది. ఈ సినిమాతో ప్రభాస్‌ను అత్యంత స్టైలిష్‌గా, వింటేజ్ లుక్‌లో చూపించడమే కాకుండా, టాలీవుడ్ గర్వించదగ్గ రీతిలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఒక హై క్వాలిటీ చిత్రంగా మారుతి దీన్ని మలుస్తున్నారు.
Also Read: త్వరలోనే పట్టాలెక్కనున్న ‘భారతీయుడు 3’ షూటింగ్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పోస్టర్ విడుదల