మేము కష్టపడి పైకి వచ్చాం.. అందుకే మా విజయాల గురించి గొప్పలు చెప్పుకోము: డాక్టర్ శ్రీరామ్ నేనే
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలీవుడ్ అగ్రనటి మాధురీ దీక్షిత్, ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్ నేనే తమ 27 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎవరి రంగాల్లో వారు అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పటికీ, విజయాన్ని తలకు ఎక్కించుకోకుండా ఎంతో ఒదిగి ఉండటం ఈ దంపతుల ప్రత్యేకత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డాక్టర్ శ్రీరామ్ నేనే తమ కుటుంబ విలువలు, మాధురీ దీక్షిత్ వ్యక్తిత్వం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంట్లో క్రమశిక్షణకు, మానసిక బలానికి మాధురీ ఒక నిదర్శనమని ఆయన కొనియాడారు.
తమ ఇద్దరి నేపథ్యం గురించి మాట్లాడుతూ, తాము ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగామని, అందుకే తమ విజయాలను ప్రదర్శించుకోవడానికి లేదా వాటి గురించి గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడమని డాక్టర్ నేనే స్పష్టం చేశారు. జీవితంలో కష్టాలను ఎదుర్కొని పైకి వచ్చిన వారికి మనుషుల విలువ, అర్థవంతమైన పనుల ప్రాముఖ్యత బాగా తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. తెరపై మరియు ఇంటర్వ్యూలలో మాధురీ ఎంత మర్యాదగా, వినయంగా కనిపిస్తారో నిజ జీవితంలోనూ అంతకంటే దయగల వ్యక్తి అని, తాను కూడా అదే సూత్రాన్ని పాటిస్తానని చెప్పారు. మనం ఇతరులను ఎలా గౌరవిస్తామో అదే తిరిగి మనకు లభిస్తుందనేది తమ నమ్మకమని ఆయన వివరించారు.
మాధురీ దీక్షిత్, డాక్టర్ శ్రీరామ్ నేనే వివాహం 1999 అక్టోబర్ 17న అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో సంప్రదాయబద్ధంగా జరిగింది. అప్పట్లో హిందీ చిత్రసీమలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న సమయంలో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. వివాహానంతరం అమెరికాకు వెళ్లిన మాధురీ, సినిమాలకు కొంతకాలం విరామం ఇచ్చి కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ దంపతులకు 2003లో పెద్ద కుమారుడు అరిన్, 2005లో చిన్న కుమారుడు ర్యాన్ జన్మించారు. కొన్నేళ్ల పాటు అమెరికాలో నివసించిన తర్వాత 2011లో పిల్లలతో కలిసి తిరిగి భారత్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత మాధురీ మళ్లీ సినిమాలు, టెలివిజన్ షోలతో ప్రేక్షకులను అలరించడం ప్రారంభించారు. కేవలం వ్యక్తిగత కెరీర్లకే పరిమితం కాకుండా, ఆర్ఎన్ఎం మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై 15 ఆగస్ట్, పంచక్ వంటి మరాఠీ చిత్రాలను కూడా ఈ జంట సంయుక్తంగా నిర్మించింది.