సాయంత్రం కోర్టుల ఏర్పాటుకు వ్యతిరేకంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ
కోటబొమ్మాళి, నవంబరు 25, మేజర్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న సాయంత్రం (ఈవినింగ్) కోర్టుల విధానానికి వ్యతిరేకంగా కోటబొమ్మాళి స్థానిక జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో న్యాయవాదులు బుధవారం విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. కోర్టు సమయాన్ని రాత్రి 8 గంటల వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, పాత పద్ధతిలోనే కోర్టులు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు లఖినేని శ్రీనివాస్‌తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.