నేడే రాజాం మున్సిపల్ పోరు.......
విజయనగరం బ్యూరో మేజర్ న్యూస్:
రాజాం మున్సిపాలిటీకి జరగనున్న రెండో సాధారణ పురపాలక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. పట్టణంలోని మొత్తం 32 వార్డులకు పోలింగ్ జరగనుండగా, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవిని బీసీ మహిళకు కేటాయించారు. వార్డుల వారీ రిజర్వేషన్ల ప్రకారం ఒక స్థానం ఎస్టీలకు, నాలుగు ఎస్సీలకు, పదకొండు బీసీలకు దక్కాయి. తొమ్మిది స్థానాలు మహిళలకు కేటాయించగా, మిగిలిన ఏడు అన్‌రిజర్వుడు కేటగిరీలో ఉన్నాయి.
ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే పట్టణంలో మొత్తం 36,787 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 18,261 మంది కాగా, మహిళలు 18,524 మంది ఉండటంతో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా నమోదయ్యారు. ఇతరులు ఇద్దరు ఉన్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం 49 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. సర్వీసు ఓటర్లు 11 మంది, పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కోసం 176 మంది ఇప్పటికే వినియోగించుకున్నారు. 4 ప్రాంతాలను హైపర్ సెన్సిటివ్ గా, 9 ప్రాంతాలను సెన్సిటివ్ గా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.
పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు విస్తృత యంత్రాంగాన్ని నియమించారు. నలుగురు జోనల్ అధికారులు, తొమ్మిది మంది రూట్ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయం చేయనున్నారు. నిబంధనల ఉల్లంఘనలను అడ్డుకునేందుకు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, ఐదు స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు నిరంతరం నిఘా పెడతాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు ఒక ప్రత్యేక బృందం పనిచేస్తోంది. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు 26 మంది మైక్రో అబ్జర్వర్లను కూడా నియమించారు.
పోలింగ్ నిర్వహణ సిబ్బందికి సంబంధించి 60 మంది ప్రిసైడింగ్ అధికారులు, 60 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 220 మంది ఇతర పోలింగ్ అధికారులను రిజర్వుతో సహా సిద్ధం చేశారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ సిబ్బంది రవాణా కోసం 12 మినీ బస్సులు, 8 మ్యాక్సీ క్యాబ్‌లు, 5 కార్లు కలిపి మొత్తం 25 వాహనాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బంది తమకు అంతా తమకు కేటాయించిన సామాగ్రితో పోలింగ్ కేంద్రానికి తరలి వెళ్లారు. పోలింగ్ సామగ్రి పంపిణీతో బాటు స్వీకరణ కేంద్రంగా బొబ్బిలి రోడ్డులోని వరలక్ష్మి సెయింట్ ఆన్స్ స్కూల్‌ను ఎంపిక చేశారు. ఇదే పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో బ్యాలెట్ పెట్టెలను భద్రపరుస్తారు. ఓట్ల లెక్కింపు హాలు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈనెల 30 న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఓటర్లు నిర్భయంగా తమ హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి కోరారు.