telanagana
సింగరేణి పాఠశాలలో ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ ప్రారంభం
సూర్య, మందమర్రి : విద్యార్థులకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యం, ఏకాగ్రత, విద్యాభ్యాసాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ కార్యక్రమాన్ని కల్యాణిఖని సింగరేణి ఉన్నత పాఠశాలలో గురువారం ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ ప్రారంభించారు. విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ఉదయాన్నే పౌష్టికాహారం తీసుకోవడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, ఉత్సాహం పెరిగి చదువులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడుతుందన్నారు. మందమర్రిలో ఏర్పాటు చేసిన సెంట్రల్ మోడర్న్ కిచెన్ నుంచి సింగరేణి పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించడం సంతోషకరమన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, పరిశుభ్రమైన వాతావరణంలో హరేకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిపుణులైన వంటవారితో ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్. రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మోడర్న్ కిచెన్ల ఏర్పాటుకు సింగరేణి సంస్థ సీఎస్‌ఆర్ నిధుల నుంచి సుమారు రూ.50 కోట్లు కేటాయించిందని రాధాకృష్ణ తెలిపారు. ఇందులో మంచిర్యాల జిల్లాలోని మోడర్న్ కిచెన్‌కు రూ.7.5 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తితో పాటు సీఎస్‌ఆర్ నిధులతో విద్య, వైద్యం, సంక్షేమ రంగాల్లో సింగరేణి పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. అనంతరం జీఎం పాఠశాల తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. త్వరలో నిర్వహించనున్న స్కూల్ డే, గోల్డెన్ జూబ్లీ వేడుకలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన అభివృద్ధి, మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని సివిల్ విభాగం అధికారులకు సూచించారు. పాఠశాలలో సిబ్బంది పెంచుతున్న కూరగాయలు, పండ్ల మొక్కలను పరిశీలించి కోతుల నుంచి రక్షణకు మెష్ ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాల కరస్పాండెంట్ అశోక్ పాఠశాలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జీఎంను కోరారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, ప్రధానోపాధ్యాయుడు జె. పురుషోత్తం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.