కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి
- దువ్వూరు పీహెచ్‌సీ వద్ద కాంట్రాక్ట్ సిబ్బంది నిరసన
- డాక్టర్ సురేష్ బాబు కు వినతిపత్రం అందజేత
దువ్వూరు మేజర్ న్యూస్ :
వైద్య ఆరోగ్య శాఖలో ఏళ్ల తరబడి సేవలందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే రెగ్యులర్ చేయాలని దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) కాంట్రాక్ట్ సిబ్బంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్ బయన్న మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖలో అంకితభావంతో సేవలందిస్తున్నప్పటికీ, నేటికీ ఉద్యోగ భద్రత లేకపోవడం తీవ్ర అన్యాయమన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి కుటుంబాలకు భరోసా కల్పించాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు విధులను బహిష్కరించి నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు.
ప్రధాన డిమాండ్లు:
వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి.
రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఉద్యోగులందరికీ 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలి.
పీఎఫ్ సహా అన్ని చట్టబద్ధమైన సౌకర్యాలు, ప్రయోజనాలు కల్పించాలి.
విధి నిర్వహణలో మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సురేష్ బాబుకు సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది మంజుల, స్వప్న, శశికళ, విజయ తదితరులు పాల్గొన్నారు.