దసరా సెలవుల అనంతరం బకాయిలు చెల్లించకపోతే హాస్టల్ నిర్వహణ కష్టమే
మంచిర్యాల జిల్లా బి ఎ ఎస్ పాఠశాలల యాజమాన్యాల విజ్ఞప్తి
సూర్య మంచిర్యాల టౌన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (బి ఎ ఎస్) పథకం కింద మంచిర్యాల జిల్లాలోని పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు రూ.7 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణ భారంగా మారిందని పేర్కొన్నారు.నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజనం,ఇతర సౌకర్యాలను అందిస్తున్నామని,ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయనే నమ్మకంతో ఇప్పటివరకు సొంత నిధులు,అప్పులు,ఇతర మార్గాల ద్వారా ఖర్చులు భరిస్తూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నామని యాజమాన్యాలు వెల్లడించాయి.అయితే ప్రస్తుతం బియ్యం,కూరగాయలు,నిత్యావసర సరుకులు, వంటగ్యాస్, విద్యుత్,రవాణా తదితర ఖర్చులు భారీగా పెరగడంతోపాటు ఉపాధ్యాయులు,వార్డెన్లు, వంట సిబ్బంది,ఇతర ఉద్యోగుల జీతభత్యాల భారం కూడా పెరిగిందన్నారు.మూడేళ్లుగా బిల్లులు విడుదల కాకపోవడంతో అప్పులు పెరిగిపోయి,విద్యార్థులకు భోజనం అందించడానికే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా బకాయిలు పూర్తిస్థాయిలో విడుదల కాలేదని తెలిపారు.గత మూడు సంవత్సరాల పెండింగ్ బిల్లులతో పాటు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి త్రైమాసిక బిల్లులను కూడా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విడుదలైన నిధులు నేరుగా సంబంధిత పాఠశాలల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.దసరా సెలవుల అనంతరం హాస్టళ్ల నిర్వహణపై ఆందోళన
ఈ నెల 9 నుంచి బి ఎ ఎస్ విద్యార్థులను దసరా సెలవుల కోసం స్వగ్రామాలకు పంపించనున్నట్లు యాజమాన్యాలు తెలిపాయి.దసరా సెలవులు ముగిసి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేలోపు పెండింగ్ బిల్లులతో పాటు 2026–27 విద్యా సంవత్సరం మొదటి త్రైమాసిక బిల్లులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోతే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాలను కొనసాగించే ఆర్థిక స్థోమత తమకు లేదని స్పష్టం చేశాయి.విద్యార్థులపై బాధ్యతను విస్మరించి ఈ నిర్ణయం తీసుకోవడం లేదని,గత మూడేళ్లుగా ఆర్థిక ఇబ్బందులను భరిస్తూ హాస్టళ్లను నిర్వహించామని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ ఆర్థిక వనరులు పూర్తిగా ఖర్చవడంతో ఇకపై అప్పులు చేసి నిర్వహించే పరిస్థితి లేదన్నారు.విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకూడదన్నదే తమ ప్రధాన ఉద్దేశమని, ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఒకవేళ దసరా సెలవుల్లోగా బిల్లులు విడుదల చేయడం సాధ్యం కాకపోతే విద్యార్థుల విద్యాభ్యాసం, వసతికి ఇబ్బందులు కలగకుండా సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.ముఖ్యమంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు సమస్యపై తక్షణమే స్పందించి బి ఎ ఎస్ పాఠశాలల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని మంచిర్యాల జిల్లా బి ఎ ఎస్ పాఠశాలల యాజమాన్యాలు, కరస్పాండెంట్లు కోరారు.