రెండున్నర ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైళ్ల స్టాపేజీలు
తాడేపల్లిగూడెం, సూర్య న్యూస్; ప్రముఖ వాణిజ్య, వ్యవసాయ, ఆక్వా, పారిశ్రామిక, విద్యా కేంద్రమైన తాడేపల్లిగూడెం లో పెండింగ్‌లో ఉన్న రైల్వే డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్‌కు చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కార్యదర్శి, జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యులు రవి అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం పట్టణం ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థలను కలిగి ఉండి, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రధాన కేంద్రంగా విలసిల్లుతోందని లేఖలో పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ స్టేషన్ అభివృద్ధి చెందుతున్నప్పటికీ, అనేక కీలకమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక్కడ నిలపకపోవడం వల్ల ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, రైతులు మరియు వ్యాపారులు దూర ప్రాంతాల స్టేషన్లైన విజయవాడ, ఏలూరు లేదా రాజమండ్రికి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాడేపల్లిగూడెంలో హల్ట్‌లు కల్పించాలి. ఈ మార్గంలో వెళ్లే కనీసం ఒక వందే భారత్ లేదా ఇతర ప్రీమియం రైలుకు ఇక్కడ స్టాపేజీ మంజూరు చేయాలి. పట్టణ దక్షిణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక ప్రవేశ ద్వారం, టికెట్ కౌంటర్ మరియు అప్రోచ్ రోడ్డును ఏర్పాటు చేయాలి. శివాలయం వద్ద ఉన్న ఎల్.సి నెం. 373 మరియు జువ్వలపాలెం, కుంచనపల్లి వద్ద ఉన్న ఎల్.సి నెం. 374 మూసివేత వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ద్విచక్ర, త్రిచక్ర వాహనాల రాకపోకల కోసం వంతెనలు లేదా క్రాసింగ్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణ ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంలో భాగం గా, రైల్వే అధికారులు ఈ సమస్యలను అత్యవసర ప్రాతిపదికన పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని రవి అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.ఇదే తరుణంలో కవరేజ్ చేయడానికి వెళ్లిన పాత్రికేయులపై రైల్వే ఉన్నతాధికారులు మీకు ఎవరు కవరేజ్ చేయడానికి అనుమతి ఇచ్చారంటూ మాట్లాడడంతో ఉన్నతాధికారుల తీరుపై పలువురు పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు.
రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా