శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
ఈ నెల 11న 1,008 మంది మహిళలతో కలశ స్థాపన, అంకురార్పణ
నెల్లూరు అర్బన్, క్రైమ్ (మేజర్ న్యూస్ : శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శరన్నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కోట గురుబ్రహ్మం, గౌరవ అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్, కార్యనిర్వాహక అధ్యక్షులు శేగు షణ్ముగరావు తెలిపారు. శుక్రవారం దేవస్థానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల వివరాలను వెల్లడించారు.ఈ నెల 11వ తేదీ ఉదయం 1,008 మంది మహిళలతో కలశ స్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.రంగనాయకులపేట గుడి నుంచి మహిళలు కలశాలతో ఊరేగింపుగా బయలుదేరి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి చేరుకుంటారని, అనంతరం అమ్మవారికి అభిషేకం నిర్వహించి అంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వివరించారు. అదే రోజు సాయంత్రం శ్రీ భవానీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారని, మూలవిరాట్టుకు కుబేర కుంకుమ అలంకారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ నెల 12న శ్రీ బాల త్రిపురసుందరి అలంకారంతో చందన అలంకారం, 13న శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంతో స్వీట్లతో అలంకరణ, 14న శ్రీ రాజరాజేశ్వరి అలంకారంతో గాజుల అలంకరణ, 15న శ్రీ గాయత్రీదేవి అలంకారంతో పాటు పూలంగి సేవ, ముత్యాల చీరతో అమ్మవారిని అలంకరించనున్నారు. 16న శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భాగంగా పుస్తకాలు, పెన్సిళ్లు, ప్యాడ్లతో అలంకరణ నిర్వహించనున్నారు. 17న శ్రీ ధనలక్ష్మీ అలంకారంలో తామర పువ్వులతో అమ్మవారిని అలంకరించనున్నారు.18వ తేదీన దుర్గాష్టమి సందర్భంగా శ్రీ దుర్గాదేవి అలంకారం, కుంభం పోయుట కార్యక్రమంతో పాటు కుంకుమ, నిమ్మకాయలతో ప్రత్యేక అలంకరణ చేపట్టనున్నారు. 19న మహర్నవమి సందర్భంగా ఉదయం కన్యాపూజ నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీ గజలక్ష్మీ అలంకారంతో పాటు మహిషాసురమర్దిని అలంకారం, పూలంగి సేవ, చెరుకులతో ప్రత్యేక అలంకరణ నిర్వహించనున్నారు.20వ తేదీన విజయదశమి సందర్భంగా అమ్మవారికి పూలంగి సేవ నిర్వహించి, సాయంత్రం నెల్లూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నగరోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 21వ తేదీ ఉదయం వసంతోత్సవం, సాయంత్రం అద్భుతమైన దర్బారు అలంకారం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ధర్మకర్తల మండలి ప్రతినిధులు కోరారు.ఈ సమావేశంలో ఆలయ ధర్మకర్తల మండలి ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి, కోశాధికారి వొమ్మిన జనార్దనరావు, ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్, సంయుక్త కార్యదర్శి మునగా వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారు ఆంజనేయులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.