ఉషశ్రీ శతజయంతికి సహకరిస్తాం డాక్టర్ జంధ్యాల, ఎం.సి. దాస్
విజయవాడ, అక్టోబర్ 09: ఉషశ్రీ శతజయంతి కార్యక్రమాల నిర్వహణకు పూర్తిగా సహకరిస్తామని విజయవాడ మాజీ మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్, ఎం.సి. దాస్ తెలియజేశారు. 2027 మార్చి 16 నుంచి 2028 మార్చి 16 వరకూ సాగే శతజయంతి కార్యక్రమాలపై సలహాలు కోరడానికి ఉషశ్రీ కుటుంబ సభ్యులు శుక్రవారం విజయవాడలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ కూడా ఇందులో పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులకు ఉషశ్రీ రచించిన రామాయణ, భారత, భాగవత గ్రంధాల ఆధారంగా క్విజ్ పోటీలు నిర్వహిస్తామని మేరీ స్టెల్లా కళాశాల తెలుగు విభాగాధిపతి వి. మంగాదేవి చెప్పారు. వచ్చే ఏడాది నిర్వహించే పుస్తక ప్రదర్శనలో ఉషశ్రీ శతజయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని మహాలక్ష్మి పబ్లిషర్స్ అధినేత ఉప్పులూరి కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఉషశ్రీ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, ఉషశ్రీ సమగ్ర సాహిత్యాన్ని ప్రచురిస్తున్నట్టు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఉషశ్రీ శతజయంతి నిర్వహిస్తే బాగుంటుందని సమావేశం అభిప్రాయపడింది.