వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి!
- యాసంగి సాగు, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి
- అధికారులకు అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి ఆదేశాలు
జిల్లాలో వర్షాభావ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, పంటల పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ కె. కిరణ్మయి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నీటి లభ్యతకు అనుగుణంగా యాసంగి 2026–27 సాగు ప్రణాళిక రూపొందించాలని, రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడంతో పాటు గ్రామీణ ఉపాధి పనులు, జల సంరక్షణ కార్యక్రమాలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వానాకాలం పంటల పరిస్థితులు, వర్షపాతం, వ్యవసాయ కార్యకలాపాలు, యాసంగి సాగు ప్రణాళిక, తాగునీటి సరఫరా, ఉపాధి పనులు, జల సంరక్షణ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అదనపు కలెక్టర్ డాక్టర్ కె. కిరణ్మయి జిల్లా అధికారులతో మాట్లాడుతూ, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. పంటల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు సకాలంలో వ్యవసాయ సలహాలు అందించాలని, తాగునీటి సరఫరా, ఉపాధి పనులు, జల సంరక్షణ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ అధికారి సుజాత, జిల్లా ఉద్యానవన అధికారి సురేష్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, సీపీఓ సౌమ్య, మిషన్ భగీరథ అధికారి రాజేశ్వర్ రావు, జిల్లా భూగర్భ జలాల అధికారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
రంగారెడ్డి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 09)