గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది..
ఇప్పుడు పనులు చేపడుతుంటే విమర్శలా?
ఎమ్మెల్యే బోడే ప్రసాద్
పెనమలూరు, మేజర్ న్యూస్ : పెనమలూరు నియోజకవర్గంలో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోం దని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. కంకిపాడు, గోసాల, చిన్నఓగిరాల, పెద్దఓగిరాల గ్రామాల్లో రూ.1.60 కోట్లతో చేపట్టనున్న రహదారులు, డ్రైనేజీల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో గ్రామాల్లో పేరుకుపోయిన మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తుంటే వైసీపీ నాయకులు స్వాగతించాల్సింది పోయి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 2014–2019 మధ్య తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కంకిపాడు ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణానికి రూ.3.20 కోట్ల నిధులు కేటాయించి టెండర్లు పిలిచామని గుర్తుచేశారు. ఎన్నికల కారణంగా పనులు నిలిచిపోవడంతో ఆ నిధులు రద్దయ్యాయని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారానికి చొరవ చూపలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ దశలవారీగా పనులు చేపడుతున్నామని తెలిపారు. కంకిపాడు ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ నిర్మించి, రాబోయే రెండేళ్లలో ప్రధాన డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడమే తమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. రాజకీయాల్లో బెదిరింపులు, దౌర్జన్యాలకు స్థానం లేదని, ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతుతోనే ఎన్నికల్లో గెలవాలని అన్నారు. కత్తులు, కటారులతో ప్రజలను భయపెట్టడం సరైన పద్ధతి కాదని, తమ పార్టీకి చెందిన వారు తప్పు చేసినా సమర్థించబోమని, తప్పును సరిదిద్దుకునేలా సూచిస్తామని పేర్కొన్నారు. విమర్శలకు అభివృద్ధి పనులే సమాధానమని, గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు, కృష్ణాజిల్లా.