పంట రైతులది.. కష్టాలు ప్రయాణికులవి! --పుణ్యపురం–సిరిపురం రహదారిపై ధాన్యం రాశులు.. ---గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ---వాహనదారులకు తప్పని అవస్థలు.. ప్రమాదాల ముప్పుతో ప్రజల ఆందోళన
--పంట రైతులది.. కష్టాలు ప్రయాణికులవి!
--పుణ్యపురం–సిరిపురం రహదారిపై ధాన్యం రాశులు..
---గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం
---వాహనదారులకు తప్పని అవస్థలు.. ప్రమాదాల ముప్పుతో ప్రజల ఆందోళన
వైరా రూరల్ (సూర్య న్యూస్):-
రైతులు పండించిన పంటను ఇంటికి చేర్చుకునే క్రమంలో ధాన్యం ఆరబెట్టుకునేందుకు సరైన స్థలం లేకపోవడంతో రహదారులనే కల్లాలుగా మార్చుకుంటున్నారు. దీంతో రైతుల పంట ప్రయాణికులకు కష్టాలు తెచ్చిపెడుతోంది. వైరా మండలంలోని పుణ్యపురం–సిరిపురం ప్రధాన రహదారిపై వరి ధాన్యాన్ని పెద్దఎత్తున ఆరబెట్టడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని రోడ్డుపైనే కుప్పలుగా పోసి, వాటిపై టార్పాలిన్లు కప్పుతున్నారు. దీంతో రహదారిలో వాహనాలు వెళ్లేందుకు సరైన మార్గం లేకుండా పోయింది. పెద్ద లారీలు సైతం ధాన్యం రాశుల పక్కన ఇరుక్కుపోయి ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫలితంగా వాహనదారులు గంటల తరబడి రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తోంది.
ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు వెళ్లాల్సి వస్తే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ధాన్యం రాశులు కనిపించక ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని వాపోతున్నారు.
కల్లాలు లేకపోవడంతోనే రోడ్లపై ధాన్యం ఆరబెట్టుకోవాల్సి వస్తోందని రైతులు చెబుతుండగా, రహదారులను పూర్తిగా ఆక్రమించి రాకపోకలకు ఆటంకం కలిగించడం సరికాదని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. రైతుల ఇబ్బందులను గుర్తిస్తూనే ప్రజలకు రవాణా ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అధికారులు ఇప్పటికైనా స్పందించి రహదారిపై ధాన్యం రాశులను తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని, రైతులకు గ్రామాల్లో శాశ్వత కల్లాల స్థలాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.