రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ.. గుజరాత్‌లో జరగనున్న జాతీయ పోటీలకు మంజుల ప్రాతినిధ్యం
క్రీడారంగంలో పరిగి విద్యార్థిని మరో ఘనత సాధించింది. పరిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎం. మంజుల జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై పాఠశాలకు పరిగి ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చింది.ఇటీవల బుధవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన 70వ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో మంజుల ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది. తదుపరి గుజరాత్‌లో జరగనున్న జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో ఆమె పాల్గొననుంది.విద్యార్థిని సాధించిన ఈ విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృపా సత్యరాజు ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ మంజులను అభినందించారు. జాతీయస్థాయిలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.మంజుల సాధించిన విజయం పరిగి ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.