అంధులను..అందరిని ఆదుకుంటున్న సదాశయ ఫౌండేషన్
సూర్య, సెంటినరీ కాలనీ :అందులను, అందరిని ఆదుకుంటున్న వస్తుంది సదాశయ ఫౌండేషన్. నేత్ర, అవయవ, దేహదానాలపై అవగాహన కల్పిస్తూ మరణానంతరం కూడా ఇతరులకు జీవితాన్ని ప్రసాదించాలనే మహోన్నత ఆశయంతో సదాశయ ఫౌండేషన్ గత 18 సంవత్సరాలుగా విశేష సేవలందిస్తోంది. ఫౌండేషన్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ఓదెల లోని మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 02అక్టోబర్2008 న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా 8వ కాలనీలో సదాశయ ఫౌండేషన్ ఆవిర్భవించింది. నేత్ర, అవయవ, దేహదానం ద్వారా మరణానంతరం కూడా సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ఈ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. నేత్ర, దేహదానం చేసిన టి. అశోక్ కుమార్ స్ఫూర్తితో, కాళోజీ ఆశయాలను అనుసరిస్తూ సంస్థ తన సేవా కార్యక్రమాలను ప్రారంభించింది. అప్పట్లో ఆర్జీ-2 జీఎం రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా 8వ కాలనీలోని సీఈఆర్ క్లబ్‌లో ఫౌండేషన్ ప్రారంభమైంది. నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో నేత్ర, అవయవ, దేహదానాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తూ ఫౌండేషన్ ప్రతినిధులు నిరంతరం కృషి చేస్తున్నారు. వారి సేవల ఫలితంగా ఇప్పటివరకు 1,660 నేత్రదానాలు, 160 దేహదానాలు, 95 అవయవ దానాలు జరిగాయి. ఈ మహోన్నత కార్యక్రమాలకు సహకరించిన దాతలు, వారి కుటుంబ సభ్యులు, సంస్థ ప్రతినిధులను ఫౌండేషన్ అభినందిస్తోంది. అవయవ దేహ దానాలపై విశేష కృషి చేస్తున్నందుకు హైద్రాబాద్ రవీంద్రభారతిలో జీవన్ దాన్ సంస్థ ద్వారా హెల్త్ సెక్రటరీ సత్కారం పొందారు.
దుఃఖంలోనూ దానానికి ముందుకు వచ్చిన కుటుంబాలకు అభినందనలు:-
ఆత్మీయులను కోల్పోయిన తీవ్ర విషాదంలోనూ ఇతరులకు చూపునివ్వాలనే ఆశయంతో నేత్రదానం చేయడం, ప్రాణాలు నిలిపేందుకు అవయవ దానం చేయడం, వైద్య పరిశోధనలకు ఉపయోగపడేలా దేహదానం చేయడం ఎంతో గొప్ప త్యాగమని ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. అలాంటి కుటుంబాలకు సదాశయ ఫౌండేషన్ తరఫున పాదాభివందనాలు తెలియజేస్తూ, వారి మానవతా విలువలను కొనియాడారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ ఏడాది కూడా నేత్ర, అవయవ, దేహదానాలు చేసిన కుటుంబ సభ్యులను వార్షికోత్సవ కార్యక్రమంలో ఘనంగా సత్కరించనున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన ఫౌండేషన్ ప్రతినిధులు, సేవా కార్యకర్తలు, దాతల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
-జీవన్‌దాన్ సంస్థ ద్వారా గుర్తింపు:-
అవయవ, దేహదానాలపై విశేష కృషి చేస్తున్నందుకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జీవన్‌దాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ సేవలకు గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా హెల్త్ సెక్రటరీ చేతుల మీదుగా సత్కారం అందుకోవడం సంస్థ సేవలకు లభించిన గౌరవంగా నిలిచింది. సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి చౌడవరపు లింగమూర్తి నేతృత్వంలో సంస్థ నేత్ర, అవయవ, దేహదానాలపై అవగాహన పెంపొందించడంతో పాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. మానవత్వం, సేవాభావం, దాతృత్వం అనే విలువలతో మరింత మందిని దాన కార్యక్రమాల వైపు ప్రోత్సహించడమే సంస్థ ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోంది.