telanagana
చెక్‌ల పంచాయితీకి చెక్!
Telanagana
10 Oct 2026
51 views
సూర్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో :గ్రామ పంచాయతీల్లో సర్పంచ్–ఉప సర్పంచ్‌ల మధ్య తలెత్తుతున్న చెక్కుల సంతకాల వివాదాలకు ప్రభుత్వం కళ్లెం వేసింది. అభివృద్ధి పనులు పూర్తయినా బిల్లుల చెల్లింపుల కోసం చెక్కులు సిద్ధం చేసిన సందర్భంలో ఉప సర్పంచ్‌లు కారణం లేకుండా సంతకాలు చేయకపోవడంతో నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడుతున్న అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా పారిశుధ్యం, తాగునీటి సరఫరా, ట్రాక్టర్ డీజిల్, ఇతర అత్యవసర సేవలకు సంబంధించిన చెల్లింపులు నిలిచిపోవడంతో గ్రామ పాలనపై ప్రభావం పడుతున్నట్లు గుర్తించింది.
గతంలో గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి ఉమ్మడి చెక్ పవర్ ఉండగా, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టే ఉద్దేశంతో ఉప సర్పంచ్‌కు కూడా చెక్ పవర్ కల్పించారు. అయితే ఈ విధానం కొన్ని గ్రామాల్లో సర్పంచ్–ఉప సర్పంచ్‌ల మధ్య కొత్త వివాదాలకు దారితీసినట్లు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. పనులు పూర్తిచేసి బిల్లులు సిద్ధం చేసినా, చెక్కులపై సంతకాల విషయంలో విభేదాలు తలెత్తడంతో చెల్లింపులు ఆలస్యమవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
ఏడు రోజుల్లో విచారణ...
ఎలాంటి చెల్లుబాటు అయ్యే కారణం లేకుండా ఉప సర్పంచ్ చెక్కులపై సంతకం చేయడం లేదా డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఖర్చులను ఆమోదించేందుకు నిరాకరిస్తున్నారంటూ ఫిర్యాదు వస్తే, సంబంధిత ప్రతిపాదనలు, పత్రాలను ఉప సర్పంచ్‌కు సమర్పించిన తేదీ నుంచి ఏడు పని దినాల్లోగా జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. విచారణలో ఆరోపణలు వాస్తవమని తేలితే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
చెక్ పవర్‌పై కూడా వేటు?...
అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు నిర్ధారణ అయితే సంబంధిత ఉప సర్పంచ్‌పై చర్యలు తీసుకునే అవకాశం కల్పించారు. అవసరాన్ని బట్టి పంచాయతీ కార్యదర్శి, ఎంపీఓ, ఎంపీడీఓ తదితర చట్టబద్ధ అధికారులకు కూడా తగిన అధికారాలను అప్పగించే వెసులుబాటు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో చెక్కులపై సంతకాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి పంచాయతీ కార్యకలాపాలకు ఆటంకం కలిగించే పరిస్థితులకు అడ్డుకట్ట పడనుంది.
అత్యవసర సేవలకు ఇక ఆటంకం వద్దు...
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, అభివృద్ధి పనులు వంటి అత్యవసర కార్యక్రమాలకు సంబంధించిన చెల్లింపులు నిలిచిపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 37, 2025లో చట్టం–2 ద్వారా చేసిన సవరణల నేపథ్యంలో అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కమిషనర్ కార్యాలయం అక్టోబర్ 1న మెమో జారీ చేసింది. తాజా ఆదేశాలతో గ్రామ పంచాయతీల్లో చెక్కుల సంతకాలపై నెలకొంటున్న వివాదాలకు తెరపడటంతో పాటు అభివృద్ధి పనులు, అత్యవసర సేవలకు సంబంధించిన చెల్లింపులు సకాలంలో జరిగే అవకాశం ఉందని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ట్యాగ్లు:
Government