బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం..
34 శాతం ప్రాతినిధ్యం కల్పించి తీరుతాం
స్థానిక ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేస్తాం : గద్దె అనురాధ
విజయవాడ తూర్పు, మేజర్ న్యూస్ : బీసీలకు రాజకీయ సాధికారత కల్పించడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ శనివారం ప్రకటనలో స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కూటమి ప్రభుత్వ ప్రయత్నానికి సుప్రీంకోర్టు తీర్పుతో ఆటంకం ఏర్పడినప్పటికీ, పార్టీ పరంగా బీసీలకు 34 శాతం ప్రాతినిధ్యం కల్పించి తీరుతామని చంద్రబాబు ప్రకటించడం బీసీల పట్ల టీడీపీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అవి సుమారు 24 శాతానికి తగ్గాయని, దీంతో బీసీలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. బీసీలకు గతంలో జరిగిన నష్టాన్ని సరిదిద్ది, వారికి రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టిందని వివరించారు. సుప్రీం కోర్టు తీర్పు పరిణామాల నేపథ్యంలో బీసీలకు రాజకీయంగా న్యాయం చేయాలన్న లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ తరఫున 34 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించడం హర్షణీయమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని, దివంగత ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు నాయుడు వరకు బీసీలకు రాజకీయ, సామాజిక గుర్తింపు కల్పించేందుకు పార్టీ నిరంతరం కృషి చేస్తోందని గద్దె అనురాధ అన్నారు. బీసీలకు పదవులు, అవకాశాలు కల్పించడంతో పాటు వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు. బీసీలు కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా, పాలనలో భాగస్వాములుగా ఎదగాలన్నదే టీడీపీ ఆకాంక్ష అని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పించి, వారి రాజకీయ ఎదుగుదలకు అండగా నిలుస్తామని ఆమె స్పష్టం చేశారు.
రిపోర్టర్ : ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.