పువ్వుల జాతర షురూ..
సూర్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో :తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఎంగిలిపూల బతుకమ్మతో తొమ్మిది రోజుల వేడుకలకు ఆడపడుచులు శ్రీకారం చుట్టారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు కనువిందు చేస్తున్నాయి. తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి మహిళలు, యువతులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఇళ్ల ముందు, వీధుల్లో మహిళలు గుమిగూడి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ జానపద గీతాలు ఆలపించారు. “ఒకేసి పువ్వేసి చందమామ” వంటి పాటలతో బతుకమ్మను కొలుస్తూ సందడి చేశారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు. పూల సేకరణ, బతుకమ్మల పేర్పు, సంప్రదాయ దుస్తుల్లో మహిళల సందడి పండుగ శోభను మరింత పెంచింది.
ప్రకృతిలో లభించే పూలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఒకచోట చేరి బతుకమ్మను పేర్చడం, పాటలు పాడుతూ సంబరాలు జరుపుకోవడం పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రానున్న రోజుల్లో సద్దుల బతుకమ్మ వరకు వేడుకలు మరింత ఉత్సాహంగా కొనసాగనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ సంబరాలతో పల్లెలు, పట్టణాలు పూలవనాలను తలపిస్తున్నాయి.