సూర్య కరీంనగర్ ప్రతినిధి పోలీస్ ఫ్లాగ్ డే–2026 సందర్భంగా అక్టోబర్ 21న నిర్వహించనున్న కార్యక్రమాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన, లఘు చిత్రాలు, ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ తెలిపారు. విద్యార్థులు, యువత, పోలీసు సిబ్బంది ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పోలీసుల త్యాగాలు, ప్రజలకు అందిస్తున్న సేవలు, శాంతిభద్రతల పరిరక్షణలో వారి పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడమే పోటీల ఉద్దేశమని పేర్కొన్నారు.12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుర్వినియోగ నియంత్రణ వంటి అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు. డిగ్రీ, ఉన్నత విద్య విద్యార్థులకు సోషల్ మీడియా దుర్వినియోగం నివారణ, తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చడంలో తమ పాత్ర వంటి అంశాలను కేటాయించారు. పోలీసుల సేవలు, ప్రజా భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై గరిష్ఠంగా మూడు నిమిషాల నిడివితో తెలుగు, ఉర్దూ లేదా ఆంగ్ల భాషల్లో లఘు చిత్రాలు రూపొందించవచ్చు. అలాగే పోలీసుల విధులు, ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతలు, పోలీసు–ప్రజల సంబంధాలపై ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నారు.లఘు చిత్రాలు, ఫోటోగ్రఫీ పోటీల్లో పాల్గొనేవారు తమ ఎంట్రీలను సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ల (SHOs) ద్వారా అక్టోబర్ 20లోగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి పంపించాలి. యూనిట్ స్థాయిలో ఎంపికైన ఉత్తమ ఎంట్రీలను రాష్ట్రస్థాయి పరిశీలనకు పంపించి, ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేస్తారు. ఎంపికైన ఎంట్రీలను అక్టోబర్ 30లోగా సంబంధిత పోలీస్ పోర్టళ్లలో అప్‌లోడ్ చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సృజనాత్మకతను చాటడంతో పాటు సమాజంలో అవగాహన పెంపొందించాలని గౌష్ ఆలం కోరారు.