రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం
ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..
నగర వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటేలా ఉత్సవాల నిర్వహణ: ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ మేజర్ న్యూస్ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు విజయవాడ ఉత్సవ్ సీజన్–2.0ను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. రేపు సాయంత్రం ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ్–2.0 కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, స్థానిక చిరు వ్యాపారులకు ఆర్థికంగా మేలు జరిగేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పడమే విజయవాడ ఉత్సవ్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
స్థానిక కళాకారులకు ప్రత్యేక ప్రాధాన్యం
ఈసారి విజయవాడ ఉత్సవ్‌లో గతంలో కంటే భిన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సుమారు 45 నిమిషాల పాటు స్థానిక కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు నిర్వహించిన అనంతరం అతిథులు సభా వేదికపైకి చేరుకుంటారని వివరించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, స్థానిక కళాకారులను ప్రోత్సహించే ప్రదర్శనలు, ప్రతిభావంతులను వెలికితీసే పోటీలు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. సినీ కళాకారులు కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని, లైవ్ కబడ్డీ, లైవ్ వాలీబాల్ పోటీలతో పాటు గజరాజుల అంబారీ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. మైసూరు ఉత్సవాల తరహాలో విజయవాడలోనూ ప్రత్యేక ఆకర్షణలతో కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
దసరా ఉత్సవాలు, సరస్ మేళా, విజయవాడ ఉత్సవ్‌ను విజయవంతం చేయాలి
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, జాతీయ సరస్ మేళా, విజయవాడ ఉత్సవ్–2.0.. ఈ మూడు కార్యక్రమాలను ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలని ఎంపీ కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. ఈ నెల 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారని, 15న జాతీయ సరస్ మేళాను ప్రారంభించనున్నారని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ మేళాలో పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారని చెప్పారు. ఈసారి విజయవాడ ఉత్సవ్‌కు విస్తృత ప్రచారం కల్పించామని, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపించినట్లు వెల్లడించారు. ఈ నెల 13న తమిళనాడు ముఖ్యమంత్రి, 17న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి విజయవాడకు వచ్చేలా షెడ్యూల్ ఉన్నట్లు పేర్కొంటూ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటన వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
వ్యాపారులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాలి
విజయవాడకు లక్షలాది మంది భక్తులు, సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున నగర ప్రజలు, వ్యాపారులు ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని ఎంపీ కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, వాణిజ్య సముదాయాలను అందంగా అలంకరించాలని సూచించారు. వాణిజ్య సంస్థలు సొంత లైటింగ్‌తో భవనాలను అలంకరించడం ఈసారి ప్రత్యేకతగా నిలుస్తోందని తెలిపారు. నగరానికి వచ్చే సందర్శకులను ఆకర్షించేలా వ్యాపారులు తమ ఉత్పత్తులపై ప్రత్యేక రాయితీలు ప్రకటించాలని, స్థానిక చిరు వ్యాపారులకు ఆదాయం పెరిగేలా సహకరించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అతిథులకు విజయవాడ ప్రజలు ఆత్మీయమైన ఆతిథ్యం అందించాలని పిలుపునిచ్చారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు విజయవాడకు వచ్చి ఇక్కడి ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రత్యేకతలను తెలుసుకోవడం ద్వారా నగర వైభవం దేశవ్యాప్తంగా మరింత విస్తరిస్తుందని ఎంపీ కేశినేని చిన్ని ఆకాంక్షించారు. ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని దసరా ఉత్సవాలు, సరస్ మేళా, విజయవాడ ఉత్సవ్–2.0ను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్ : ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.