విజయవాడ ఉత్సవ్–2.0 ప్రజలందరి పండుగ
దసరా అంటేనే విజయవాడ గుర్తుకొచ్చేలా వేడుకలు: కేశినేని జానకి లక్ష్మి
విజయవాడ, మేజర్ న్యూస్ : విజయవాడ ఉత్సవ్–2.0ను ప్రజలందరి పండుగగా, గతంలో కంటే మరింత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సతీమణి జానకి లక్ష్మి తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలో ఉత్సవ్ ఏర్పాట్లను ఆమె పరిశీలించి, కార్యక్రమాల కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను దేశవ్యాప్తంగా చాటిచెప్పాలనే లక్ష్యంతో ఎంపీ కేశినేని చిన్ని గత ఏడాది విజయవాడ ఉత్సవ్‌కు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. దసరా పండుగ అనగానే దేశవ్యాప్తంగా విజయవాడ గుర్తుకొచ్చేలా ఈ ఏడాది వేడుకలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వంటి ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొనేలా కార్యక్రమాలను రూపొందించడం నగరానికి గర్వకారణమన్నారు. ఉత్సవ్‌లో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏడు విభాగాల్లో 100కు పైగా పోటీలు నిర్వహిస్తున్నామని, ప్రతిరోజూ వందలాది మంది ఔత్సాహికులు పాల్గొని తమ ప్రతిభను చాటుకుంటున్నారని తెలిపారు. విద్యార్థులు, యువత, మహిళలు, కళాకారుల్లోని ప్రతిభను వెలికితీయడంతో పాటు కళలు, సంస్కృతిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని వివరించారు. “మనం ఇంట్లో జరుపుకుంటే అది పండుగ.. అందరం కలిసి జరుపుకుంటే అది ఉత్సవం” అని పేర్కొన్న జానకి లక్ష్మి, విజయవాడ ఉత్సవ్ ఒక సంస్థకో, కొందరికో పరిమితమైన వేడుక కాదని, నగర ప్రజలందరూ తమ సొంత పండుగగా భావించి పాల్గొనాలని పిలుపునిచ్చారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం విజయవాడకు వచ్చే భక్తులు, పర్యాటకులు ఉత్సవ్‌లోనూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు రూపొందించామని తెలిపారు. పగటిపూట ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు, వినోద కార్యక్రమాలతో సందర్శకులకు మరపురాని అనుభూతిని అందించనున్నట్లు చెప్పారు. విజయవాడను ఆధ్యాత్మిక వైభవంతో పాటు కళా, సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా దేశవ్యాప్తంగా నిలబెట్టేందుకు ఉత్సవ్–2.0 దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఏ సుంకర అక్కయ్య నాయుడు, డాక్టర్ చదలవాడ సుధా నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ అడ్వకేట్ వైట్ల కృష్ణ ప్రసన్న, తొండెపు హనుమంతరావు, తొండెపు ప్రసాద్ గుప్తా, వీరభట్ల విష్ణువర్ధన్, చెన్నుపాటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.