దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
- ఆధునిక సాంకేతికతతో భక్తుల రద్దీపై నిరంతర నిఘా.. * 40 పార్కింగ్ కేంద్రాలు, మూడు హోల్డింగ్ ప్రాంతాలు ఏర్పాటు
విజయవాడ క్రైం, మేజర్ న్యూస్ : విజయవాడలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరిగే దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్ 2.0, పున్నమి ఘాట్‌లో జాతీయ సరస్ మేళా నేపథ్యంలో సుమారు 3,130 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు తెలిపారు. శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వివిధ జిల్లాల నుంచి బందోబస్తు విధులకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఆయన దిశానిర్దేశం చేశారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బందోబస్తులో భాగంగా బూమ్ బ్యారియర్లు, ప్రవేశ నియంత్రణ వ్యవస్థలతోపాటు దాదాపు 30 డ్యాష్‌బోర్డులతో కూడిన ఆధునిక నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కృత్రిమ మేధ కెమెరాలు, డ్రోన్లు, వాహనాల నంబరు గుర్తింపు వ్యవస్థ, డిజిటల్ ట్విన్ పరిజ్ఞానంతో క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాలు, రైల్వే స్టేషన్, ఆర్టీసీ ప్రయాణికుల రద్దీని నిరంతరం పర్యవేక్షించనున్నారు. భక్తుల సంఖ్యను అంచనా వేయడానికి 70కి పైగా ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో 40 పార్కింగ్ కేంద్రాలు, మూడు హోల్డింగ్ ప్రాంతాలను సిద్ధం చేశారు. అక్కడ ఎల్‌ఈడీ తెరల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు, దర్శనానికి పట్టే సమయాన్ని తెలియజేయనున్నారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం ఓం టర్నింగ్ వద్ద వాహనాల పార్కింగ్‌కు అనుమతి లేదని, అనుమతిపత్రాలు కలిగిన వాహనాలు మాత్రమే ప్రయాణికులను దింపేందుకు అక్కడికి వెళ్లి తిరిగి కిందకు రావాలని స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్ నుంచి వచ్చే భక్తులు గద్దెబొమ్మ సెంటర్ మీదుగా ఫ్లైఓవర్ పక్కనున్న సర్వీస్ రోడ్డు గుండా వినాయక ఆలయం వద్ద క్యూలైన్లలోకి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. కుమ్మరిపాలెం వైపు నుంచి వచ్చే భక్తులు టోల్‌గేట్, దుర్గాఘాట్ అండర్‌పాస్ మీదుగా ఓం టర్నింగ్ నుంచి ఆలయంలోకి ప్రవేశించవచ్చన్నారు. దర్శనం అనంతరం నిర్ణీత మార్గంలో శివాలయం మెట్ల ద్వారా కిందకు వచ్చి అన్నప్రసాదం స్వీకరించి, ప్రసాదం కౌంటర్ నుంచి లడ్డూలు తీసుకుని సూచించిన మార్గంలో బయటకు వెళ్లాలని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం కుమ్మరిపాలెంలోని టీటీడీ ఖాళీ ప్రదేశం నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా ఆలయానికి రాకపోకలు కల్పించనున్నారు. బందోబస్తు సిబ్బంది ప్రశాంతంగా, చిరునవ్వుతో సేవాభావంతో వ్యవహరించాలని, భక్తులతో మర్యాదగా మాట్లాడుతూ విజిల్స్, రికార్డు చేసిన ప్రకటనలతో కూడిన మెగాఫోన్ల ద్వారా మార్గదర్శనం చేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు. దేవస్థానం, ఇతర శాఖల సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని, మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించే సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని, నియంత్రణ కేంద్రం నుంచి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, షిరిన్ బేగం, తిరుమలేశ్వర రెడ్డి, కె.జి.వి.సరిత, లక్ష్మీనారాయణ, కృష్ణ ప్రసన్న తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.