telanagana
భీమేశ్వర స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్
సూర్య, వేములవాడ:వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్, ఇన్‌చార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ హనుమంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.భీమేశ్వర స్వామి వసతి గృహానికి చేరుకున్న కమిషనర్ దంపతులకు ఆలయ డీఈఓ ప్రతాప నవీన్ కుమార్ పూల మొక్కను అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ దంపతులు స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనం అందజేశారు. ఆలయ డీఈఓ ప్రతాప నవీన్ కుమార్ స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని కమిషనర్ దంపతులకు అందజేశారు.
పండుగ ఏర్పాట్లపై సమీక్ష
ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ఉద్యోగులతో సమావేశమైన కమిషనర్ హనుమంతరావు రాబోయే దసరా, సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. పండుగల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు పండుగల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.