కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఎమ్మిగనూరు డీఎస్పీ ఏ. శ్రీనివాసులు పర్యవేక్షణలో శనివారం నందవరం మండలం కనకవీడు గ్రామంలో పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మిగనూరు రూరల్ సీఐ ఎస్. చిరంజీవి, నందవరం ఎస్‌ఐ ఎం. తిమ్మారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొని గ్రామస్థులకు చట్టాలు, నేరాలపై అవగాహన కల్పించారు.
మద్యం, గంజాయి, పేకాట, మట్కా వంటి వ్యసనాలు, జూదాలకు దూరంగా ఉండాలని సీఐ చిరంజీవి సూచించారు. గంజాయి వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడంతో పాటు కుటుంబాలపై ఆర్థిక, సామాజిక ప్రభావం చూపుతుందని వివరించారు. అక్రమ మద్యం విక్రయాలు, గంజాయి, అసాంఘిక కార్యకలాపాల సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని, బాల్యవివాహాలను ప్రోత్సహించరాదని సూచించారు.
రాబోయే ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి గొడవలు, బెదిరింపులు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా భద్రతా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు.